న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1: జీఎస్టీ వసూళ్లు మరింత పెరిగాయి. ఆగస్టు నెలలో రూ.1.86 లక్షల కోట్లు వసూలైనట్టు కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. క్రితం ఏడాది ఇదే నెలలో వసూలైన రూ.1.75 లక్షల కోట్లతో పోలిస్తే 6.5 శాతం అధికమైనప్పటికీ, జూలై నెలలో వసూలైన రూ.1.96 లక్షల కోట్లతో పోలిస్తే భారీగా తగ్గాయి.
గత నెలలో వసూలైనదాంట్లో దేశీయంగా రూ.1.37 లక్షల కోట్లు వసూలవగా, దిగుమతులపై పన్ను విధించడంతో రూ.49,354 కోట్లు సమకూరాయి. జీఎస్టీ రిఫండ్స్ ఏడాది ప్రాతిపదికన 20 శాతం తగ్గి రూ.19,359 కోట్లకు పరిమితమయ్యాయి.
గడిచిన నెలలో తెలంగాణలో రూ.5,103 కోట్ల జీఎస్టీ వసూలయ్యాయి. క్రితం ఏడాది ఇదే నెలలో వసూలైన రూ.4,569 కోట్లతో పోలిస్తే 12 శాతం వృద్ధి నమోదైంది. అలాగే ఆంధ్రప్రదేశ్లోనూ రూ.3,989 కోట్లు వసూలైనట్టు కేంద్రం తాజాగా వెల్లడించింది.