న్యూఢిల్లీ, డిసెంబర్ 1: గత కొన్ని నెలలుగా రికార్డు స్థాయిలో దూసుకుపోయిన జీఎస్టీ వసూళ్లకు బ్రేక్‌పడింది. గత నెలకుగాను రూ.1.70 లక్షల కోట్ల జీఎస్టీ వసూలైనట్టు కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. జీఎస్టీ రేట్లను తగ్గించడంతో వసూళ్లలో గండిపడిందని పేర్కొంది. క్రితం ఏడాది ఇదే నెలలో వసూలైన రూ.1.69 లక్షల కోట్లతో పోలిస్తే స్వల్పంగా పెరుగుదల నమోదు చేసుకున్నది.
అయినప్పటికీ గడిచిన ఏడాదికాలంలో ఇదే తక్కువస్థాయి వసూళ్లు కావడం విశేషం. నవంబర్ నెలలో వసూలైన రూ.1.70 లక్షల కోట్లతో దేశీయంగా రూ.1.24 లక్షల కోట్లు వసూలవగా, దిగుమతి చేసుకున్న వస్తువులపై విధించే పన్నుతో రూ.45,976 కోట్ల నిధులు సమకూరాయి.
రిఫండ్స్ 4 శాతం తగ్గి రూ.18,196 కోట్లకు పరిమితమయ్యాయి. జీఎస్టీ సంస్కరణల్లో భాగంగా రేట్లను కుదించడంతోపాటు పలు లగ్జరీ ఉత్పత్తులపై పన్నును కోత పెట్టడంతో వసూళ్లు భారీగా పడిపోయాయని తెలిపింది. గతంలో నాలుగు రకాల పన్ను విధించిన కేంద్రం.. ప్రస్తుతం దీనిని 5 శాతం, 18 శాతానికి తగ్గించింది. అక్టోబర్‌లో నమోదైన రూ.1.96 లక్షల కోట్లతో పోలిస్తే భారీగా తగ్గింది.