IDBI Bank | ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంకుల్లో వాటాల ఉపసంహరణ లక్ష్యాల దిశగా అడుగులేస్తున్నట్లు కనిపిస్తున్నది. ఒక దెబ్బకు ఐపీవో ద్వారా ఎల్ఐసీలో వాటాల ఉపసంహరణ, మరోవైపు ఎల్ఐసీతోపాటు ఐడీబీఐ బ్యాంక్‌లో ప్రభుత్వానికి ఉన్న వాటా పూర్తిగా వదిలించుకోవాలని యోచిస్తున్నట్లు తెలియవచ్చింది. ఐడీబీఐ బ్యాంకులో వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణతో ఆకర్షణీయ బిడ్డర్లు, ఇన్వెస్టర్ల కోసం కేంద్ర ప్రభుత్వం రోడ్ షోలు నిర్వహించనున్నాయి. ఈ నెల 25 నుంచి కేంద్రం, ఎల్ఐసీ తమ వాటాలను ఉపసంహరించనున్నాయి.
ఈ బ్యాంక్ ప్రైవేట్దైనా మెజారిటీ వాటా 49.24 శాతం ఎల్ఐసీదే. ఇక ప్రభుత్వానికి 45.48 శాతం వాటా ఉంది. ప్రభుత్వం పూర్తిగా తన వాటాను ఉపసంహరించుకోవాలని భావిస్తున్నది. ఐపీవోకు వెళుతున్న నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలు, బ్యాంకుల్లో వాటాలను పూర్తిగా ఉపసంహరించుకోవాలని ఎల్ఐసీ తలపెట్టింది. అందుకు అనుగుణంగా ఐడీబీఐ బ్యాంకులో ఎల్ఐసీ తన వాటా మొత్తం మరో ఇన్వెస్టర్‌కు విక్రయించడానికి సిద్ధమైంది.
కరోనా నేపథ్యంలో భౌతికంగా సమావేశం కావడానికి ఇన్వెస్టర్లు సిద్ధంగా లేరని అధికారులు తెలిపారు. వర్చువల్ భేటీల ద్వారానే చర్చలు జరుగుతాయన్నారు. వ్యూహాత్మక ఇన్వెస్టర్లను ఎంచుకోవడానికి కేపీఎంజీ, లింక్ లీగల్ సంస్థలను డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ (దీపం) నియమించింది. ఐడీబీఐ బ్యాంకులో వాటాల ఉపసంహరణ, దానికి సంబంధించిన లావాదేవీల ప్రక్రియపై ఆర్బీఐతో ఎల్ఐసీ, కేంద్రం చర్చించనున్నాయి.