EPFO | ఉద్యోగులకు కేంద్రం (central government) త్వరలో గుడ్ న్యూస్ చెప్పబోతున్నట్లు తెలిసింది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (Employees Provident Fund Organisation) వేతన పరిమితిని కేంద్ర ప్రభుత్వం పెంచాలని (raise the wage ceiling) యోచిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం రూ.15,000గా ఉన్న ఈ సీలింగ్‌ను రూ.21,000కు తీసుకెళ్లాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలిసింది. త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకొని.. వీలైనంత త్వరగా ప్రకటన కూడా విడుదల చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు విశ్వసనీయ వర్గాలను ఊటంకిస్తూ.. జాతీయ మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి.
ఉద్యోగుల సంఖ్యను బట్టి ఈపీఎఫ్ఓలో కంపెనీల నమోదు ఉండాలి. ప్రస్తుతం 20 అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న కంపెనీలు తప్పనిసరి ఈపీఎఫ్ఓలో చేరాల్సి ఉండగా.. దీనిని త్వరలో మరింత తగ్గించనున్నట్లు తెలుస్తోంది. ఆ సంఖ్యను 10-15కు తగ్గించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. అయితే, చిన్న- మధ్య తరహా పరిశ్రమలు మాత్రం ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు సదరు కథనాలు పేర్కొంటున్నాయి.
చివరిసారి 2014లో..
2014లో చివరిసారిగా పీఎఫ్ సాలరీ లిమిట్‌ను కేంద్ర ప్రభుత్వం పెంచింది. రూ.6,500ల నుంచి రూ.15,000కు మార్చింది. ఇక 1952లో ఈ పథకం మొదలైంది. అప్పట్నుంచి ఇప్పటిదాకా మొత్తం 8సార్లు పెంచారు. 1952లో రూ.300గా ఉన్నది. అయితే దీన్ని 1957లో రూ.500కు, 1962లో రూ.1,000కి, 1976లో రూ. 1,600కు, 1985లో రూ.2,500కు, 1990లో రూ.3,500కు, 1994లో రూ.5,000కు, 2001లో రూ.6,500కు, 2014లో రూ.15,000కు సవరించారు.
కంపెనీలపై భారం పడినా.. ఉద్యోగులకు మాత్రం లాభమే
ఈపీఎఫ్‌వో వేతన పరిమితి పెరిగితే కంపెనీల యాజమాన్యాలపై భారం పడినా.. ఉద్యోగులకు మాత్రం లాభమే జరుగుతుంది. ఉద్యోగి బేసిక్ సాలరీ, డీఏ ఆధారంగా ప్రావిడెంట్ ఫండ్‌కు నగదు మొత్తాలు నెలనెలా జమవుతాయన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఉద్యోగి జీతం నుంచి 12 శాతం, దీనికి సమానంగా యాజమాన్యం ద్వారా మరో 12 శాతం పీఎఫ్ ఖాతాకు వెళ్తుంది. దీనికి సంబంధించిన వేతన పరిమితే ప్రస్తుతం రూ.15,000గా ఉన్నది. దీన్నే రూ.21,000కు పెంచాలని చూస్తున్నారు. ఇదే పెరిగితే ఇప్పటిదాకా రూ.15,000 ప్రాతిపదికన పీఎఫ్ ఖాతాకు జమవుతున్న మొత్తాలు.. ఇకపై రూ.21,000 ప్రాతిపదికన జమవుతాయి. దీనివల్ల ఉద్యోగి రిటైర్మెంట్ ఫండ్‌కు నిధులు పెరుగుతాయి. పదవీ విరమణ సమయంలో మరింత ఎక్కువగా నగదును పొందవచ్చు. కాగా, ఉద్యోగి పీఎఫ్ ఖాతాకు కంపెనీల ద్వారా వెళ్లే 12 శాతంలో 8.33 శాతం సొమ్ము సదరు ఉద్యోగి పెన్షన్ ఖాతాకు వెళ్తుంది. మిగతా 3.67 శాతం ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలో జమవుతుంది. ఉద్యోగి నుంచి తీసుకునే మొత్తాలు మాత్రం పూర్తిగా ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలోకే వెళ్తాయి. అలాగే ప్రభుత్వం నుంచి కూడా 1.16 శాతం ఉద్యోగుల పెన్షన్ పథకంలోకి వచ్చి చేరుతుంది.
Also Read..
Bitcoin | ఫస్ట్ టైం 80 వేల డాలర్ల చేరువలో బిట్ కాయిన్..!
PAN Card – Aadhar | నూతన పాన్ కార్డ్ రూల్.. ఈ గడువు లోపు ఆధార్‌తో అనుసంధానించకుంటే ఇక అంతే..!
FPI Investments | ఐదు సెషన్లలోనే రూ.20 వేల కోట్ల ఎఫ్‌పీఐల ఉపసంహరణ..!