FPI Investments | దేశీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్లు నిరాటంకంగా నిధుల ఉపసంహరణ కొనసాగుతున్నది. గత ఐదు సెషన్లలో సుమారు రూ.20 వేల కోట్ల విలువైన పెట్టుబడులను ఫారిన్ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్లు ఉపసంహరించారు. దేశీయ స్టాక్ విలువలు ఎక్కువగా ఉండటంతోపాటు చైనా షేర్లు ఆకర్షణీయంగా మారడం దీనికి కారణం. అందుబాటులో ఉన్న డేటా ప్రకారం ఈ నెల 4-8 మధ్య ఎఫ్‌పీఐలు రూ.19,994 కోట్ల విలువైన నికర పెట్టుబడులు ఉపసంహరించారు. గత నెలలో 94,017 కోట్ల విలువైన వాటాలను విత్ డ్రా చేశారు. 2020 మార్చిలో ఈక్విటీ మార్కెట్ల నుంచి రూ.61,973 కోట్ల విలువైన వాటాలు ఉపసంహరించారు.
సెప్టెంబర్ నెలలో విదేశీ ఇన్వెస్టర్లు తొమ్మిది నెలల గరిష్ట స్థాయిలో రూ.57,724 కోట్ల విలువైన వాటాలు కొనుగోలు చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ – మే నెలల్లో రూ.34,252 కోట్ల విలువైన వాటాలు ఉపసంహరించారు ఎఫ్‌పీఐలు. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ 2025 జనవరిలో బాధ్యతలు స్వీకరిస్తారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలతోపాటు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు కార్పొరేట్ సంస్థల ఫలితాలు, రిటైల్ ఇన్వెస్టర్ల వ్యవహార శైలి తదితర అంశాలను బట్టి ఎఫ్‌పీఐలు ప్రభావితం అవుతాయి.