Bitcoin | క్రిప్టో కరెన్సీ మేజర్ బిట్ కాయిన్ తొలిసారి 80 వేల డాలర్లకు చేరువలోకి వచ్చి చేరింది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికవ్వడంతో డిజిటల్ అసెట్స్‌కు మద్దతు లభిస్తుందని భావిస్తున్నారు. ఆదివారం ట్రేడింగ్‌లో బిట్ కాయిన్ అసాధారణ రీతిలో 4.3 శాతం పుంజుకుని 79,771 డాలర్లకు చేరుకున్నది. సింగపూర్ మార్కెట్లో ఆదివారం మధ్యాహ్నం 2.05 గంటల వరకూ 79 వేల డాలర్లకు సమీపాన నిలిచింది. కార్నాడో, మీమ్ క్రౌడ్ ఫేవరెట్ డోజ్ కాయిన్ కూడా పుంజుకున్నాయి. 2024లో బిట్ కాయిన్ విలువ సుమారు 90 శాతం పెరిగింది. యూఎస్ ఫెడ్ రిజర్వ్ కీలక వడ్డీరేట్లు తగ్గించడంతోపాటు డెడికేటెడ్ యూఎస్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ డిమాండ్ పెరగడం బిట్ కాయిన్ విలువ వృద్ధి చెందడానికి కారణమైంది.