న్యూఢిల్లీ, ఏప్రిల్ 2: ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ గత పదేండ్లుగా రిలయన్స్ జియోకి బిల్లు వేయనందువల్ల కేంద్ర ప్రభుత్వానికి రూ.1,757.56 కోట్ల నష్టం వచ్చిందని కాగ్ వెల్లడించింది. మౌలిక సదుపాయాలను పంచుకోవడంపై బీఎస్ఎన్ఎల్, రిలయన్స్ జియో మధ్య ఒప్పందం ఉన్నప్పటికీ దానిని అమలు చేయడంలో టెలికం సంస్థ విఫలమైందని కాగ్ ఓ ప్రకటనలో తెలిపింది.
టెలికం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడర్లకు(టిప్స్) చెల్లించిన రెవెన్యూ షేర్ నుంచి లైసెన్సు ఫీజును మినహాయించని కారణంగా బీఎస్ఎన్ఎల్కు రూ.38.36 కోట్ల నష్టం వాటిల్లిందని కాగ్ వివరించింది. రిలయన్స్ జియోతో కుదుర్చుకున్న మాస్టర్ సర్వీస్ అగ్రిమెంట్(ఎంఎస్ఏ)ను అమలుచేయడంలో బీఎస్ఎన్ఎల్ విఫలమైందని, కంపెనీకి చెందిన మౌలిక సదుపాయాలు ఉపయోగించుకున్నా అదనపు టెక్నాలజీకి బిల్లు వేయని కారణంగా కేంద్రం రూ.1,757.76 కోట్ల ఆదాయాన్ని కోల్పోవాల్సి వచ్చిందని కాగ్ వెల్లడించింది.