న్యూఢిల్లీ, మార్చి 12: ప్రభుత్వ రంగ జీవిత బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ)లో మరింత వాటాలను అమ్మేందుకు మోదీ సర్కారు సిద్ధమవుతున్నది. వచ్చే ఆర్థిక సంవత్సరం (2025-26)లో మార్కెట్ పరిస్థితులనుబట్టి 2 నుంచి 3 శాతం వాటాలను విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్టు సమాచారం. అంటే స్టాక్ మార్కెట్లు నష్టాల్లో నడిస్తే తక్కువగా, లాభాల్లో పరుగులు పెడితే ఎక్కువగా ఎల్ఐసీ నుంచి ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణలు ఉంటాయన్నమాట.
రాబోయే ఆర్థిక సంవత్సరంలో ఒకేసారి పెద్దమొత్తంలో కాకుండా కొద్దికొద్దిగానైనా ఎక్కువసార్లు వాటాలను అమ్మకానికి పెట్టి వీలున్నంత గరిష్ఠంగా సొమ్ము చేసుకోవాలన్నదే కేంద్ర ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తున్నది. ఇక 2027 మే 16కల్లా ఎల్ఐసీలో 10 శాతం వాటాను ఎట్టి పరిస్థితుల్లోనైనా అమ్మేయాలని కేంద్రం భావిస్తున్నది. స్టాక్ మార్కెట్ రెగ్యులేటర్ సెబీ మినిమం పబ్లిక్ షేర్‌హోల్డింగ్ నిబంధనల్ని అందుకోవాలంటే ఇది తప్పనిసరి. 2022 మే నెలలో ఎల్ఐసీలో 3.5 శాతం వాటాను ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) ద్వారా కేంద్రం అమ్మేసిన విషయం తెలిసిందే. తద్వారా రూ.21,000 కోట్లను ఖజానాకు తరలించగా, దేశీయ స్టాక్ మార్కెట్లలోకి ఎల్ఐసీ అడుగు పెట్టింది. అయితే మినిమం పబ్లిక్ షేర్‌హోల్డింగ్ రూల్స్‌ను కంపెనీ పాటించలేపోతున్నది. ఈ నేపథ్యంలోనే మూడేండ్ల గడువు లభించింది. ఇది 2027 మే 16తో ముగియనున్నది. ఈలోపు ఎల్ఐసీలో 10 శాతం ప్రభుత్వ వాటాలను అమ్మాలని చూస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ ఏప్రిల్‌తో మొదలయ్యే ఏడాదిలో 3 శాతం మేర వాటాలను విక్రయించాలని చూస్తున్నారు.
వచ్చే మూడేండ్లకుపైగా కాలంలో ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ ప్రణాళికలో భాగంగా ఎల్ఐసీతోపాటు పలు ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఆర్థిక సంస్థల్లోనూ వాటాలను అమ్మేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. ఆయా కంపెనీల జాబితాను కూడా సిద్ధంగా ఉంచినట్టు చెప్తున్నారు. ఈ క్రమంలోనే ఇందుకోసం మర్చంట్ బ్యాంకర్లు, లీగల్ అడ్వైజర్ల సహాయార్థం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ శాఖ (దీపం) దరఖాస్తులను ఆహ్వానించింది.
గడిచిన ఏడాదికిపైగా కాలంలో ఎల్ఐసీ షేర్ విలువ 23.29 శాతం క్షీణించడం గమనార్హం. గత ఆరు నెలల్నే తీసుకుంటే 26.66 శాతం పతనం కనిపిస్తున్నది. ఈ నెల రోజుల్లోనే 3.37 శాతం పడిపోయింది. దీంతో ఎల్ఐసీ షేర్లలో పెట్టుబడులు పెట్టిన మదుపరులకు నష్టాలే మిగులుతున్నట్టవుతున్నది. నిజానికి దేశంలోనే అతిపెద్ద సంస్థాగత మదుపరి ఎల్ఐసీ. వందలాది కంపెనీల్లో ఎల్ఐసీకి వాటాలున్నాయి. అయితే స్టాక్ మార్కెట్లు గతకొద్ది నెలలుగా నేలచూపుల్నే చూస్తుండటంతో ఈ వాటాలు కాస్తా ఆవిరైపోతున్నాయి. భారీ ఎత్తునే నష్టాలను మూటగట్టుకోవాల్సి వస్తున్నది. దాంతో స్టాక్ మార్కెట్ల వల్ల అటు బయటి కంపెనీల్లో పెట్టుబడులు, ఇటు సొంతంగా షేర్లు దిగజారిపోతుండటం.. ఎల్ఐసీ పాలసీదారులనూ కలవరపెడుతున్నదిప్పుడు.