న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2: ఇప్పటికే దేశంలో ప్రభుత్వ రంగ బ్యాంకు (పీఎస్బీ)ల సంఖ్యను విలీనాల పేరిట తగ్గించేసిన మోదీ సర్కార్.. ఇక ఆ మిగిలిన బ్యాంకుల్లోనూ వాటాలు కుదించాలని చూస్తున్నది. దాదాపు గడిచిన 12 ఏండ్లలో ఎన్నో ప్రభుత్వ బ్యాంకులు కనుమరుగయ్యే నిర్ణయాలు తీసుకున్న కేంద్రం.. ఇప్పుడు మరో కీలక నిర్ణయం దిశగా వెళ్తున్నది. ఇందులో భాగంగానే పీఎస్బీల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ)కున్న పరిమితిని ఏకంగా 49 శాతానికి పెంచాలని యోచిస్తున్నారు. ఇప్పుడున్న దానితో పోల్చితే ఇది రెట్టింపునకుపైగా కావడం గమనార్హం. ప్రస్తుతం గరిష్ఠంగా 20 శాతానికి మించి ప్రభుత్వ బ్యాంకుల్లో విదేశీ పెట్టుబడులు ఉండరాదన్నది నిబంధన.
ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఎఫ్‌డీఐ పరిమితిని పెద్ద ఎత్తున పెంచడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)తో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ గతకొంత కాలంగా చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. నిజానికి మొదట్నుంచీ దేశంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉనికిని ప్రశ్నార్థకం చేసేలాగే మోదీ సర్కార్ ముందుకెళ్తున్నది. ఇప్పటికే ఐడీబీఐ బ్యాంక్‌ను ప్రైవేటీకరణ వైపునకు తీసుకెళ్లగా, ఎస్బీఐలో దాని అనుబంధ బ్యాంకులతోపాటు, భారతీయ మహిళా బ్యాంకునూ విలీనం చేసేసింది. మిగతా బ్యాంకులనూ ఆయా బ్యాంకుల్లో కలిపేసింది. నరేంద్ర మోదీ ప్రధాన మంత్రి కాకముందు దేశంలో 27 ప్రభుత్వ బ్యాంకులుండేవి. ఇప్పుడవి 12కు పడిపోయాయి. వీటిని కూడా విలీనం చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు విదేశీ సంస్థలకు మరింతగా ప్రభుత్వ బ్యాంకుల వాటాలను అమ్మే యోచన చేస్తున్నారు. దీంతో ఆర్బీఐ ఆమోదం లభిస్తే చాలా బ్యాంకులు విదేశీ గుప్పిట్లోకి వెళ్లడం ఖాయమేనన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇదిలావుంటే 2020 నుంచి పీఎస్బీల్లో కేంద్రం వాటాలు యథాతథంగానే ఉంటున్నాయి. అయితే బ్యాంకులు షేర్ల జారీ ద్వారా నిధుల సమీకరణలకు దిగుతుండటంతో ఆయా సంస్థల్లోని సర్కార్ షేర్ల సంఖ్యలో హెచ్చుతగ్గులుంటున్నాయి.
దేశంలోని ఆయా ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో ఇప్పటికే పలు విదేశీ కంపెనీలు మెజారిటీ వాటాలను హస్తగతం చేసుకున్నాయి. ఈ మధ్య కూడా ఆర్బీఎల్, యెస్ బ్యాంకుల్లో వాటాల లావాదేవీలు జరిగాయి. ఈ నేపథ్యంలో దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంకులపైనా విదేశీ సంస్థాగత మదుపరుల కన్ను పడుతున్నది. దీనికి తగ్గట్టే కేంద్ర ప్రభుత్వ చర్యలు ఉంటుండటం అటు బ్యాంకింగ్ పరిశ్రమను, ఇటు ఆర్థిక రంగ నిపుణులను ఒకింత కలవరపాటుకు గురిచేస్తున్నదిప్పుడు. ప్రస్తుతం ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో విదేశీ పెట్టుబడులకున్న గరిష్ఠ పరిమితి 74 శాతంగా ఉన్నది. 49 శాతందాకా ఎఫ్‌డీఐకి ఆటోమేటిక్ రూట్ పనిచేస్తుంది. ఆపై 74 శాతం వరకు ప్రభుత్వ అనుమతి అవసరం.
ప్రభుత్వ బ్యాంకు ల్లో పెరిగే విదేశీ సంస్థల వాటా.. భారతీయ బ్యాంకింగ్ రంగంలో పరాయి దేశాల పెత్తనానికి దారితీయగలదన్న ఆందోళనలైతే కనిపిస్తున్నాయి. ఏ రంగంలోనైనా ప్రభుత్వ సంస్థలు సేవా దృక్పథంతో పనిచేస్తుంటాయని, అయితే ప్రైవేటీకరణ.. సంస్థ పనితీరును వ్యాపారపరంగా మార్చేస్తుందని నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో ప్రభుత్వ బ్యాంకుల సేవలు పేద ప్రజలు, గ్రామీణ ప్రాంత వాసుల అవసరాలకు అనుగుణంగా ఉంటాయని, విదేశీ సంస్థల వాటాలు పెరిగితే ఈ ఆశయానికి దెబ్బేనని హెచ్చరిస్తున్నారు. మొత్తానికి సర్కార్ బ్యాంకుల ఉనికినే ప్రశ్నార్థకం చేస్తున్న కేంద్ర ప్రభుత్వ తీరు.. పేద, మధ్యతరగతి ప్రజలకు బ్యాంకింగ్ సేవలను మున్ముందు ఖరీదెక్కించడం ఖాయమేనన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతుండటం గమనార్హం.

ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఎఫ్‌డీఐ పరిమితిని 49 శాతానికి పెంచే అంశాన్ని పరిశీలిస్తున్నాం. వివిధ మంత్రిత్వ శాఖలతో సంప్రదింపులూ జరుగుతున్నాయి. అలాగే ఈ నెలలోగానీ, వచ్చే నెలలోగానీ వ్యూహాత్మక విక్రయంలో భాగంగా ఐడీబీఐ బ్యాంక్‌లో కేంద్ర ప్రభుత్వ వాటాల అమ్మకానికి ఫైనాన్షియల్ బిడ్లను ఆహ్వానించే వీలున్నది. ప్రస్తుత భారత ఆర్థిక వ్యవస్థ పరిమాణానికి తగ్గట్టు 3 లేదా 4 భారీ బ్యాంకుల అవసరం ఉన్నది.
-ఎం నాగరాజు, ఆర్థిక సేవల కార్యదర్శి