షాద్‌నగర్, జూన్ 16: భారీ పరిశ్రమలకు కేంద్రంగా, వేలాది మంది కార్మికులకు కల్పతరువుగా ఉన్న షాద్‌నగర్ ప్రాంతం.. నేడు ఉసూరుమంటున్నది. ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో కొత్తగా ఒక్క కంపెనీ కూడా ఏర్పాటుకాకపోవడంతో ఉపాధి అవకాశాలే కరువయ్యాయి. బీఆర్ఎస్ పాలనలో టీఎస్ఐపాస్ ద్వారా కొత్తూరు, షాద్‌నగర్ పారిశ్రామిక వాడల్లో నూతన పరిశ్రమలు వెలిశాయని కార్మికులు గుర్తుచేస్తున్నారు. స్థానికులతోపాటు దేశం నలుమూలల నుంచి వచ్చిన వేలాది మందికి ఉపాధి లభించిందని పేర్కొంటున్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త పరిశ్రమల ఏర్పాటుకు చొరవ చూపడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికితోడు ప్రభుత్వ అస్తవ్యస్థ పారిశ్రామిక విధానాలతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు తగ్గుముఖంపట్టే దుస్థితి నెలకొన్నదని నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు.
షాద్‌నగర్ ప్రాంతం హైదరాబాద్‌కు సమీపంలోనే ఉన్నా దశాబ్దాల సమైక్య పాలనలో వివక్షకు గురైంది. దీంతో ఉపాధి అవకాశాలు లేక స్థానికులు వలసలు వెళ్లే దుస్థితి ఉండేది. 44వ జాతీయ రహదారి, రైలు సౌకర్యం ఉండటంతో 1976లో నాటి ప్రభుత్వం కొత్తూరు పారిశ్రామిక వాడ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. కానీ ఆశించిన స్థాయిలో స్థానికులకు ఉపాధి లభించలేదు. పెట్టుబడిదారులు, కాంట్రాక్టర్లు ఇతర ప్రాంతాలకు చెందినవారు కావడంతో స్థానికులకు అవకాశాల్లేకుండా పోయాయి. దీంతో వలసలు పెరిగాయి. తర్వాత కొత్తూరు పారిశ్రామిక వాడతోపాటు షాద్‌నగర్, కొందర్గు, కేశంపేట మండలాల్లో పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. అయితే ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వాలు వాటికి అండగా నిలబడలేదు. సదుపాయాలు కల్పించక, కావాల్సిన సాయం అందించక నిర్వీర్యం చేశాయి. దీంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడేనాటికి షాద్‌నగర్ ప్రాంతంలో దాదాపు సగం పరిశ్రమలు మూతబడ్డాయి. ఫలితంగా వేలాది మంది కార్మికులు రోడ్డునపడ్డారు.
కేసీఆర్ పాలనలో తీసుకొచ్చిన టీఎస్ఐపాస్తో షాద్‌నగర్ రూపురేఖలే మారిపోయాయి. వలసలను నివారించడంతోపాటు స్థానికులకు ఉపాధి అవకాశాలను పెంచాలనే లక్ష్యంతో, భారీ పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులను నాటి సర్కారు ఇచ్చింది. పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడంతో ఏటా షాద్‌నగర్‌లో నూతన పరిశ్రమలు వెలిశాయి. మైక్రోసాఫ్ట్ డాటా సెంటర్, అమెజాన్, జాన్సన్ అండ్ జాన్సన్, పీఅండ్‌జీ, ఎంఎస్ఎన్ ఫార్మా, పోకర్ణ టైయిల్స్, విజయ పాలిమర్స్, టోటల్ అయిల్ వంటి భారీ పరిశ్రమలతోపాటు 100కుపైగా ఇండస్ట్రీలు షాద్‌నగర్ ప్రాంతంలో వెలిశాయని కార్మికులు చెప్తున్నారు.
టీస్ఐపాస్ ద్వారా కొత్తూరు, ఫరూఖ్‌నగర్, నందిగామ, కొందుర్గు, చౌదరిగూడ మండలాల్లో పెద్ద ఎత్తున పరిశ్రమలు వెలిశాయి. ఫలితంగా అదనంగా దాదాపు 30వేల మందికి ఉపాధి అవకాశాలు వచ్చాయని కార్మిక సంఘాల నేతలు, అధికారులు చెప్తున్నారు. అంతేగాక తెలంగాణతోపాటు ఏపీ, కర్ణాటక, తమిళనాడు, బీహార్, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, అసోం, ఒడిశా, కేరళ, మహారాష్ట్ర, గుజరాత్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, రాజస్థాన్ తదితర రాష్ర్టాల నుంచి వచ్చి ఈ ప్రాంతంలో ఉపాధి పొందుతుండటం గమనార్హం.
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో మళ్లీ పాత రోజులు వచ్చే ప్రమాదం ఉన్నదని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏడాదిన్నర కాలంగా ఈ ప్రాంతంలో కొత్తగా పరిశ్రమలు ఏర్పాటు కాలేదని వాపోతున్నారు. కనీసం ప్రభుత్వం ఈ దిశగా చొరవ చూపినట్టు కూడా కనిపించడం లేదని ఆవేదన చెందుతున్నారు. వాస్తవానికి 1976లో పారిశ్రామిక వాడ మొదలైనా దాదాపు నాలుగు దశాబ్దాల ఉమ్మడి పాలనలో అనుకున్న స్థాయిలో షాద్‌నగర్ అభివృద్ధి చెందలేదని గుర్తుచేస్తున్నారు. పాలకుల వైఫల్యమే ఇందుకు కారణంగా చెప్తున్నారు. ఇప్పుడు కూడా మళ్లీ అలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయని, షాద్‌నగర్‌ను నమ్ముకొని వస్తున్న నిరుద్యోగులకు ఉపాధి దొరుకక నిరాశే మిలుగుతున్నదని పేర్కొంటున్నారు. ప్రభుత్వం వెంటనే ఉపాధి, వనరుల పెంపుపై దృష్టి సారించాలని కోరుతున్నారు.
నేను ఐటీఐ చదివాను. ఇక్కడి పరిశ్రమల్లో సరైన ఉపాధి అవకాశాలు కనిపించడం లేదు. మా ఊరు చుట్టు ప్రక్కల కొత్త పరిశ్రమలు రావడం లేదు. దీంతో ఉద్యోగాలు దొరుకడం లేదు. ప్రభుత్వం కాలుష్యం లేని పరిశ్రమలు ఏర్పాటు చేయాలి, ఇక్కడి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలి.
-జంగ మధు, జంగోనిగూడ
కాంగ్రెస్ వచ్చి ఏడాదిన్నర అయ్యింది. కానీ షాద్‌నగర్ ప్రాంతంలో ఒక్క కొత్త పరిశ్రమ కూడ రాలే. నమ్ముకొని వచ్చే కార్మికుల సంఖ్య నానాటికి పెరుగుతున్నది. ఉపాధి వనరులు మాత్రం తగ్గుతున్నాయి. గతంతో పోల్చుకుంటే ఇక్కడ పరిశ్రమల ఏర్పాటు తగ్గిపోయింది.
-రాజు, సీఐటీయూ, షాద్‌నగర్
ఉపాధి కల్పించాలంటే పరిశ్రమల ఏర్పాటు ప్రధానమైనది. బీఆర్ఎస్ పాలనలో టీఎస్ఐపాస్ విధానాన్ని ప్రవేశపెట్టి దళారి వ్యవస్థను నిర్మూలించి పారిశ్రామికవేత్తలను, పెట్టుబడి దారులను ప్రోత్సహించింది. పరిశ్రమల ఏర్పాటుకు అన్ని వసతులను సమకూర్చింది. దీంతో అప్పట్లో చాలా పరిశ్రమలు వచ్చాయి. వేలాది మందికి ఉపాధి లభించింది. కొత్త ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర పూర్తి కావస్తున్నా ఒక్క పరిశ్రమ కూడా రాలేదు.
-వై అంజయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యే, షాద్‌నగర్