న్యూఢిల్లీ, అక్టోబర్ 7: జీఎస్టీ పరిహారం కింద బ్యాక్ టు బ్యాక్ రుణ సదుపాయంగా తెలంగాణ రాష్ర్టానికి కేంద్రం గురువారం రూ.1,149.46 కోట్లు విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి రూ.823.17 కోట్లు విడుదలయ్యాయి. ఈ సదుపాయం కింద వివిధ రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం మొత్తం రూ.40,000 కోట్లు విడుదల చేసింది.సెస్ వసూళ్ల నుంచి ప్రతీ రెండు నెలలకు సాధారణంగా చెల్లించే జీఎస్టీ పరిహారానికి ఈ బ్యాక్ టు బ్యాక్ రుణాలు అదనమని ఆర్థిక శాఖ తెలిపింది. ఈ సదుపాయం కింద ఈ ఏడాది ఇప్పటివరకూ రూ.1.15 లక్షల కోట్లను కేంద్రం రాష్ర్టాలకు ఇచ్చింది. రాష్ర్టాలకు జీఎస్టీ పరిహారం చెల్లించేందుకు సెస్‌ను వసూలుచేసి, జీఎస్టీ ఫండ్‌లో జమచేస్తున్నారు. కానీ ఈ ఫండ్‌లో రాష్ర్టాలకు చెల్లించాల్సిన స్థాయిలో నిధులు జమకాక, కేంద్రం పరిహారం చెల్లింపులో బకాయిపడుతూ ఉంది. దీంతో బాండ్ల జారీద్వారా కేంద్రం మార్కెట్ రుణాల్ని తీసుకొని, వాటిని బ్యాక్ టు బ్యాక్ రుణ సదుపాయంగా రాష్ర్టాలకు చెల్లిస్తున్నది.