Gold Price | న్యూఢిల్లీ, ఏప్రిల్ 16: బంగారం ధరలు కొత్త శిఖరాన్ని అధిరోహించాయి. తొలిసారి దేశీయ మార్కెట్లో తులం రేటు రూ.98,000 మార్కును అధిగమించింది. బుధవారం ఢిల్లీలో 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత) 10 గ్రాముల విలువ ఆల్‌టైమ్ హైని తాకుతూ రూ.98,100గా నమోదైంది. ఈ ఒక్కరోజే రూ.1,650 పుంజుకోవడం గమనార్హం. ఈ మేరకు అఖిల భారత సరఫా అసోసియేషన్ తెలిపింది.
కాగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెరతీసిన ప్రతీకార సుంకాలు.. ప్రపంచవ్యాప్తంగా స్టాక్, బాండ్ మార్కెట్లలో తీవ్ర అలజడులను సృష్టిస్తున్నాయి. ఈ ఒడిదుడుకుల నుంచి తప్పించుకొనేందుకు మదుపరులు తమ పెట్టుబడులను పుత్తడి వైపునకు మళ్లిస్తున్నారని, ఇటీవలికాలంలో ధరలు ఇలా ఉరకలు వేయడానికి ప్రధాన కారణం అదేనని మార్కెట్ నిపుణులు ప్రస్తుత ట్రేడింగ్ సరళిని విశ్లేషిస్తున్నారు.
ఈ నెల 11న తులం ధర ఏకంగా రూ.6,250 ఎగిసిన విషయం తెలిసిందే. ఇప్పటిదాకా భారతీయ మార్కెట్లలో ఒక్కరోజే ఈ స్థాయిలో పెరగడం అదే మొదటిసారి. మరోవైపు ఈ ఏడాది మొదలు పసిడి ధర దేశీయం గా 10 గ్రాములు రూ.19,150 లేదా 24 శాతం ఎగిసింది. గత ఏడాది డిసెంబర్ 31న తులం రేటు రూ.78,950 వద్ద ముగిసింది.
హైదరాబాద్‌లోనూ పుత్తడి ధరలు దౌడుతీస్తున్నాయి. 24 క్యారెట్ 10 గ్రాముల విలువ రూ.990 పెరిగి రూ.96,170కి చేరింది. అలాగే 22 క్యారెట్ (99.5 స్వచ్ఛత లేదా నగల బంగారం) రేటు రూ.950 అందుకుని రూ.88,150 వద్ద నిలిచింది. ధరలు క్రమేణా పెరుగుతూపోతున్న నేపథ్యంలో అమ్మకాలతో సంబంధం లేకుండా జ్యుయెల్లర్స్, రిటైలర్ల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ వస్తున్నదని బులియన్ ట్రేడర్లు చెప్తున్నారు. ఇక ఢిల్లీలో కిలో వెండి ధర రూ.1,900 పెరిగి రూ.99,400ను తాకింది. సాధారణ కొనుగోలుదారులతోపాటు ఇండస్ట్రీ వర్గాల నుంచి ఆదరణ వస్తుండటం కలిసొస్తున్నదని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం, వెండి ధరలు దూసుకుపోతున్నాయి. ఔన్స్ గోల్డ్ రేటు గరిష్ఠంగా 3,318 డాలర్లు పలికింది. ఔన్స్ వెండి 32.86 డాలర్లుగా నమోదైంది. కాగా, అమెరికా-చైనా మధ్య పరస్పర సుంకాలు పెరిగినకొద్దీ గోల్డ్ రేట్లు పరుగులు పెడుతూనే ఉంటాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే భారతీయ మార్కెట్లో తులం లక్ష రూపాయల మార్కును చేరే సమయం ఎంతో దూరంలో లేదన్న అంచనాలు వినిపిస్తున్నాయి.