Gold Rate | బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. ఇటీవల కాలంలో వరుసగా పెరుగుతూ వస్తున్నాయి. తాజాగా అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఔన్స్‌కు 3వేల డాలర్లు దాటింది. ప్రస్తుతం ఔన్సుకు 3040 డాలర్ల వద్ద ట్రేడవుతున్నది. పసిడి ధర ఈ స్థాయిలో పెరగడం ఇదే తొలిసారని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. మధ్యప్రాశ్చంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వాణిజ్య విధానాలకు సంబంధించిన అనిశ్చిత కారణంగా పెట్టుబడిదారులు బంగారంపై ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో డిమాండ్ పెరగడంతో ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌కు చెందిన మనీష్ మోదీ మాట్లాడుతూ.. ప్రపంచ వాణిజ్య యుద్ధం భాలు, భౌగోళిక రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో పెట్టుబడిదారులు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని.. ఫలితంగా బంగారం డిమాండ్ రోజురోజుకు పెరుగుతోందన్నారు. గత 210 రోజుల్లో బంగారం ధర ఔన్స్‌కు 2500 డాలర్ల నుంచి 3వేల డాలర్లకు పెరిగింది.
సాధారణంగా ఈ స్థాయిలో పసిడి ధర పెరిగేందుకు దాదాపు 1,700 రోజుల సమయం పడుతుంది. కానీ, ప్రస్తుతం ఊహించని విధంగా పెరుగుదల కనిపించింది. బంగారం ధరలు స్వల్పంగా తగ్గవచ్చని.. కానీ భౌగోళిక రాజకీయ, ఆర్థిక అనిశ్చితి, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్ల కోతలు, యూఎస్ డాలర్ బలహీనపడడం కారణంగా పుత్తడిపై పెట్టుబడులు కొనసాగుతున్నాయని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ నివేదిక ఇటీవల తెలిపింది. ఇక భారత్ మార్కెట్లో బంగారం ధరలు 10 గ్రాములకు రూ.91వేల మార్క్‌ని దాటాయి. కామా జ్యువెలరీ ఎండీ కాలిన్ షా మాట్లాడుతూ భారత్ 80శాతం బంగారాన్ని దిగుమతి చేసుకుంటుందని.. ఈ క్రమంలో అంతర్జాతీయ మార్కెట్లోని ధరలు దేశీయ మార్కెట్‌పై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయన్నారు. ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తే.. గోల్డ్ ధర ఔన్స్‌కు 3100 డాలర్లు దాటే అవకాశం ఉందని.. భారత్‌లో రూ.91వేలు దాటుతుందని అంచనా వేస్తన్నట్లు పేర్కొన్నారు. స్టాక్ మార్కెట్లో అస్థిరత నేపథ్యంలో పెట్టుబడిదారులు గోల్డ్ ఎక్స్ఛేంజ్-టేడ్రెడ్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెడుతున్నారు. 2025లో గోల్డ్ ఈటీఎఫ్‌ల్లో రికార్డులు స్థాయిలో పెట్టుబడులు పెరిగాయి.