Gold Price | న్యూఢిల్లీ, మే 3: బంగారం ధరలు తగ్గాయి. శుక్రవారం హైదరాబాద్‌లో 24 క్యారెట్ 10 గ్రాములు రూ.540 పడిపోయి రూ.71,730 వద్ద నిలిచింది. 22 క్యారెట్ పుత్తడి తులం విలువ కూడా రూ.500 దిగి రూ.65,750గా ఉన్నది. గురువారం ముగింపుతో చూస్తే ఢిల్లీ స్పాట్ మార్కెట్లోనూ 24 క్యారెట్ పసిడి రేటు 10 గ్రాములు రూ.350 క్షీణించింది.
ఇదిలావుంటే అంతర్జాతీయ మార్కెట్లోనూ పసిడి ధరలు నేల చూపుల్నే చూశాయి. ఔన్సు 7 డాలర్లు దిగి 2,297 డాలర్లకు పరిమితమైంది. ద్రవ్యోల్బణ భయాల నడుమ గత అంచనాలను తలకిందులు చేస్తూ అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్.. వడ్డీరేట్లను తగ్గించడానికి చాలా కాలమే తీసుకుంటుందన్న ఊహాగానాలు గోల్డ్ మార్కెట్‌ను కుదిపేశాయని మార్కెట్ నిపుణులు తాజా ట్రేడింగ్ సరళిని విశ్లేషిస్తున్నారు. కాగా, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి.