హైదరాబాద్, మే 1 : నిన్నమొన్నటిదాకా ఆకాశమే హద్దుగా పరుగులు పెట్టిన బంగారం ధరలు.. ఇప్పుడు అంతే వేగంగా దిగొస్తున్నాయి. గురువారం ఒక్కరోజే హైదరాబాద్లో 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత) 10 గ్రాముల రేటు రూ.2,180 తగ్గి రూ.95,730 వద్ద స్థిరపడింది. 22 క్యారెట్ (99.5 స్వచ్ఛత) తులం విలువ కూడా రూ.2,000 పడిపోయి రూ.87,750 వద్ద నిలిచింది. నిజానికి గత వారం రోజులుగా గోల్డ్ రేట్లు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. అంతకుముందు తులం రేటు తొలిసారి లక్ష రూపాయల మార్కును దాటిపోయిన విషయం తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాలు, వివిధ కారణాలతో పతనమైన స్టాక్ మార్కెట్ల వల్ల దేశీయ మార్కెట్లో పుత్తడి ధరలు వరుసగా పెరుగుతూపోయాయి. అయితే అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వస్తున్న బలహీన సంకేతాల నడుమ ధరలు దిగువముఖం పడుతున్నాయి.