Gold Prices | న్యూఢిల్లీ, సెప్టెంబర్ 26: బంగారం ధరలు రికార్డు స్థాయిలో దూసుకుపోతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాల ధరలు ఎన్నడు లేని గరిష్ఠ స్థాయికి చేరుకోవడంతో దేశీయంగా వరుసగా రెండోరోజూ రూ.78 వేల మార్క్‌ను అధిగమించాయి. దేశ రాజధాని ఢిల్లీలో తులం పుత్తడి ధర రూ.400 ఎగబాకి రూ.78,250 పలికింది. పండుగ సీజన్ కూడా తొడవడంతోపాటు గ్లోబల్ మార్కెట్లో ధరలు పుంజుకోవడం వల్లనే ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ వెల్లడించింది.
బుధవారం గోల్డ్ ధర రూ.77,850 పలికింది. బంగారంతోపాటు వెండి ధరలు మరింత అధికమయ్యాయి. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి మద్దతు లభించడంతో కిలో వెండి రూ.1,000 అధికమై రూ. 94 వేలకు చేరుకున్నది. ఇటు హైదరాబాద్‌లో 24 క్యారెట్ గోల్డ్ ధర రూ.77,020 వద్ద కొనసాగుతుండగా, 22 క్యారెట్ ధర రూ.70,600 వద్ద ఉన్నది. కిలో వెండి ధర రూ.1,01,000కి చేరుకున్నది. మరోవైపు, అంతర్జాతీయ మార్కెటైన కోమెక్స్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 2,701.20 డాలర్లకు చేరుకోగా, వెండి 32.86 డాలర్ల వద్ద ఉన్నది.
ద్రవ్యోల్బణం కట్టడి చేయడానికి ఇప్పటి వరకు వడ్డీరేట్లను పెంచుకుంటూ పోయిన పలు సెంట్రల్ బ్యాంక్‌లు ప్రస్తుతం వడ్డీరేట్లలో కోతలు పెడుతుండటం, దీనికి తోడు పశ్చిమాసియా దేశాల్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం కూడా పసిడికి డిమాండ్ నెలకొన్నదని బులియన్ వర్తకులు వెల్లడించాయి. రూపాయితో పోలిస్తే డాలర్ విలువ క్రమంగా పడిపోతుండటం కూడా మరో కారణమన్నారు.
ప్రస్తుతం రికార్డు స్థాయిలో పెరిగిన ధరలు దీపావళి నాటికి 76-78 వేల స్థాయిలోనే ఉండనున్నాయని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీ కమోడిటీ హెడ్ అనూజ్ గుప్తా తెలిపారు. ఫెడ్ వడ్డీరేట్లు తగ్గించినప్పటీ నుంచి పుత్తడి ధర దూసుకుపోతున్నదన్నారు. అయినప్పటికీ ఈ ఏడాది బంగారం ధరలు 27 శాతం వరకు పెరగడంతో కొనుగోళ్లు నిలిచిపోయాయన్నారు. అలాగే వెండి రూ.92-95 వేల స్థాయి లో ఉంటుందని అంచనావేస్తున్నారు.