Gold Price | హైదరాబాద్, ఆగస్టు 17: బంగారం ధర మళ్లీ భగ్గుమన్నది. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాల ధరలు దూసుకుపోవడంతో దేశీయ ధరలు పుంజుకున్నాయి. వచ్చే నెల సమీక్షలో ఫెడరల్ రిజర్వులు వడ్డీరేట్లను అర శాతం వరకు తగ్గించే అవకాశం ఉన్నట్లు వచ్చిన సంకేతాలు మదుపరులు తమ పెట్టుబడులను అతి సురక్షితమైన పుత్తడివైపు మళ్లించారు.
దీంతో గ్లోబల్ మార్కెట్లో ఒకేరోజు ఔన్స్ ధర రెండు శాతం వరకు పెరిగాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో తులం పుత్తడి ధర అయితే ఏకంగా రూ.72 వేలు దాటింది. శుక్రవారం ముగింపుతో పోలిస్తే 99.9 శాతం స్వచ్ఛత కలిగిన 24 క్యారెట్ పదిగ్రాముల బంగారం ధర రూ.1,150 అధికమై రూ.72,770 పలికింది. అటు 22 క్యారెట్ ధర కూడా రూ.1,050 అధికమై రూ.66,700కి చేరుకున్నది.
బంగారంతో పాటు వెండి పరుగులు పెట్టింది. కిలో వెండి రూ.2000 అధికమై రూ.91 వేలు పలికింది. అంతకుముందు ఇది రూ.89 వేలుగా ఉన్నది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ లేకపోయినప్పటికీ ధరలు పెరగడం విశేషం. మరోవైపు పండుగ సీజన్, పెళ్లిళ్ల సీజన్ కావడంతో కొనుగోళ్లు ఊపందుకున్నాయని వ్యాపారస్తులు చెబుతున్నారు.