Gold @ Rs 70K | రూ.2000 నోటును మార్కెట్లో చలామణి నుంచి ఉపసంహరిస్తూ ఆర్బీఐ నిర్ణయం తీసుకున్నది. ఈ వార్త బయటకు రాగానే దీన్ని సొమ్ము చేసుకోవడానికి గుజరాత్లోని జ్యువెల్లరీ వ్యాపారుల్లో సరికొత్త ఆలోచన వచ్చింది. రూ.2000 నోట్లతో బంగారం కొనుగోలు చేసే వారికి ధరలు పెంచేశారని, పది గ్రాముల బంగారం (24 క్యారట్లు) ధర రూ.70 వేలుగా నిర్ణయించారని సమాచారం. గుజరాత్ బులియన్ మార్కెట్లో శనివారం తులం బంగారం (24 క్యారట్లు) ధర రూ.60,275 పలికింది.
శుక్రవారం ఆర్బీఐ వార్త వెలుగులోకి రాగానే పది గ్రాముల బంగారం కొనుగోలు చేయడానికి వచ్చే వారి వద్ద రూ.2000 విలువైన నోట్లు 5-10 వరకు తీసుకుంటున్నట్లు బులియన్ మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. అంటే పది గ్రాముల బంగారం మీద రూ.70 వేలు (అంటే రూ.2000 విలువైన నోట్లు 35) తీసుకుంటున్నారు. కిలో బంగారం ధర కూడా రూ.80 వేలు పలుకుతున్నది.
శనివారం గుజరాత్ లోని బంగారం దుకాణాల్లో 24 క్యారట్ల బంగారం (తులం) ధర రూ.60,275, 23 క్యారట్ల బంగారం తులం రూ.60,034, 22 క్యారట్ల బంగారం తులం రూ.55,212, 18 క్యారట్ల బంగారం తులం రూ.45,206 పలుకుతున్నది.
భారీ మొత్తంలో రూ.2000 నోట్లను బ్యాంకు శాఖలో గానీ, ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో గానీ మార్చుకోవాలన్నా.. డిపాజిట్ చేయాలన్నా .. సంబంధిత వ్యక్తులు తమ వార్షిక ఆదాయాల ప్రాతిపదికన ఆదాయం పన్ను (ఇన్ కం టాక్స్) పే చేయాలి. ఆయా వ్యక్తుల వనరులకు మించిన సొమ్ము కలిగి ఉంటే ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు విచారణ చేపడతాయి. ఇటువంటి ఇబ్బందుల్ని తప్పించుకోవాలంటే బంగారం కొనుగోలు చేయడం తేలిక అని ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ వైస్ ప్రెసిడెంట్ అనూజ్ గుప్తా తెలిపారు. భారీ మొత్తంలో మనీ నిల్వ ఉంచుకోవడం కంటే బంగారం దాచి పెట్టుకోవడం తేలిక అని పేర్కొన్నారు. 2016లో పాత పెద్ద నోట్లు (రూ.1000, రూ.500) రద్దు చేసినప్పుడు కూడా బంగారం కొనుగోళ్లు పుంజుకున్నాయన్నారు. తులం బంగారం ధర రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు దూసుకెళ్లింది.
స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్లో ఒడిదొడుకులు తలెత్తినప్పుడు బులియన్ మార్కెట్లో బంగారానికి మద్దతు లభించింది. ఇన్వెస్టర్లకు ఆల్టర్నేటివ్ పెట్టుబడి మార్గంగా బంగారం కనిపించింది. తాజాగా ఆర్బీఐ నిర్ణయం తర్వాత రూ.2000 నోట్లతో బంగారం కొనుగోళ్లు చేస్తున్నారని అనూజ్ గుప్తా తెలిపారు. దీనివల్ల ఈ నెలాఖరుకల్లా తులం బంగారం ధర రూ.65 వేలు, కిలో వెండి ధర రూ.80 వేలు దాటవచ్చునని అంచనా వేశారు.
ఈ ఏడాది బంగారం ధర శరవేగంగా పెరుగుతున్నది. జనవరి ఒకటో తేదీన తులం బంగారం (24 క్యారట్లు) ధర రూ.54,867 పలికింది. ఇప్పుడు రూ.60,275 లకు లభిస్తున్నది. అంటే రూ.5408 పెరిగిందన్నమాట.
బ్లాక్ మనీని అరికట్టేందుకు ఏడేండ్ల క్రితం కేంద్రం పాత పెద్ద నోట్లు (రూ.1000, రూ.500) రద్దు చేసింది. బ్లాక్ మనీ దాచుకున్న వారు ఈ సమస్య నుంచి బయట పడ్డారు. కానీ, ఇటీవలి కాలంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), ఆదాయం పన్ను విభాగం, సీబీఐ, వివిధ రాష్ట్రాల పోలీసులు జరిపిన దాడుల్లో రూ.2000 కరెన్సీ నోట్లు గుట్టగుట్టలుగా బయట పడ్డాయి. ఇటీవల జరిపిన ఆరు ప్రధాన ఆపరేషన్లలో 600 కోట్లకు పైగా నగదు బయట పడింది. కాన్పూర్ పర్ఫ్యూమ్ బిజినెస్ వ్యాపారి వద్ద 284 కోట్లు, హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న ఫార్మాస్యూటికల్ కంపెనీ వద్ద రూ.142.87 కోట్ల కరెన్సీ బయట పడింది.