న్యూఢిల్లీ, జూలై 7: బంగారం ధరలు మరింత దిగొచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ పడిపోవడం, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాల విధింపుపై మరొసారి హెచ్చరికలు జారీ చేయడంతో గ్లోబల్ మార్కెట్లో అతి విలువైన లోహాల ధరలు భారీగా పడిపోయాయి. ఇదే క్రమంలో దేశీయంగా పదిగ్రాముల పుత్తడి ధర రూ.99 వేల దిగువకు పడిపోయింది.
ఢిల్లీ బులియన్ మార్కెట్లో తులం ధర రూ.550 తగ్గి రూ.98,570కి పరిమితమైంది. అలాగే 99.5 శాతం స్వచ్ఛత కలిగిన గోల్డ్ ధర రూ.500 తగ్గి రూ.98,100కి దిగొచ్చింది. కానీ, వెండి ధరల్లో ఎలాంటి మార్పులు నమోదుకాలేదు. కిలో వెండి రూ.1,04,800 వద్ద కొనసాగుతున్నది. ఇంటర్నేషనల్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 38.95 డాలర్లు లేదా 1.17 శాతం తగ్గి 3,298.69 డాలర్లకు పరిమితమైంది.