Gold Price | న్యూఢిల్లీ, జనవరి 16: బంగారం ధరలు మళ్లీ పరుగుపెడుతున్నాయి. ఆభరణాల వర్తకులు కొనుగోళ్లకు మొగ్గుచూపడం, రూపాయి పతనం చెందడంతో పుత్తడి ధరలు రివ్వున ఎగిశాయి. దేశ రాజధాని న్యూఢిల్లీ మార్కెట్లో తులం పుత్తడి ధర రూ.500 ఎగబాకి రూ.81,300కి చేరుకున్నది.
దీంతో ఈ ధరలు రెండు నెలల గరిష్ఠ స్థాయిని తాకయని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ వర్గాలు వెల్లడించాయి. బంగారంతోపాటు వెండి పరుగులు పెట్టింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు ఊపందుకోవడంతో కిలో వెండి ఏకంగా రూ.2,300 ఎగబాకి రూ.94 వేలు పలికింది.
మరోవైపు, దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడోరోజు లాభాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 318.74 పాయింట్లు ఎగబాకి 77 వేలు అధిగమించి 77,042.82 వద్ద నిలువగా, నిఫ్టీ 98.50 పాయింట్లు అందుకొని 23,311.80 వద్ద నిలిచింది.