న్యూఢిల్లీ, డిసెంబర్ 24: బంగారం, వెండి ధరలు అడ్డూ అదుపులేకుండా దూసుకుపోతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో రోజుకొక గరిష్ఠ స్థాయిని తాకుతున్న అతి విలువైన లోహాల ధరలు బుధవారం ఆకాశమే హద్దుగా దూసుకుపోయాయి. వెండి మరో చారిత్రక గరిష్ఠ స్థాయిని తాకింది. న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో కిలో వెండి ఏకంగా రూ.9,750 ఎగబాకి రూ.2,27,000కి చేరుకున్నది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ వెండి ధర 72 డాలర్లు పలకడంతో దేశీయ ధరలు పుంజుకుంటున్నాయని ఆల్ ఇండియా సరఫా అసోసియేషన్ వెల్లడించింది. మంగళవారం ఈ ధర రూ.2,17,250గా ఉన్నది.
గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ వెండి ఆల్‌టైం హైకి 72 డాలర్లకు చేరుకోవడం వల్లనే దేశీయంగా అధికమవుతున్నదని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు వెండి ఏకంగా రూ.1,37,300 లేదా 153 శాతం ఎగబాకింది. గతేడాది డిసెంబర్ 31న రూ.89,700గా ఉన్న కిలో ధర ప్రస్తుతం రూ.2 లక్షలు దాటింది. డాలర్ బలహీనంగా ఉండటం, అమెరికా ఫెడరల్ రిజర్వు వచ్చే సమీక్షలో వడ్డీరేట్లను తగ్గించే అవకాశాలు సన్నగిల్లడం, ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుండటంతో మదుపరులు తమ పెట్టుబడులను సురక్షితమైన అతి విలువైన లోహాలవైపు మళ్లించడంతో వీటి ధరలు పెరుగుతున్నాయని సౌమిల్ గాంధీ వెల్లడించారు.
వెండితో పోలిస్తే బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. 99.9 శాతం స్వచ్ఛత కలిగిన గోల్డ్ ధర రూ.50 తగ్గి రూ.1,40,800గా నమోదైంది. అంతకుముందు ఇది రూ.1,40,850గా ఉన్నది. గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర తొలిసారిగా 4,500 డాలర్లు పలికింది. గత నాలుగు రోజుల్లో పసిడి 186.46 డాలర్లు లేదా 4.3 శాతం ఎగబాకింది. అలాగే ఈ ఏడాది ఇప్పటి వరకు 1,920.19 డాలర్లు లేదా 73.7 శాతం ఎగబాకినట్టు అయింది.