న్యూఢిల్లీ, నవంబర్ 28: బంగారం, వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. శుక్రవారం ఢిల్లీలో 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత) 10 గ్రాముల పుత్తడి విలువ రూ.700 పుంజుకొని రూ.1,30,160గా నమోదైంది. ఇక కిలో వెండి రేటు రూ.3,000 ఎగబాకి రూ.1,71, 200గా ఉన్నది. దీంతో ఆల్‌టైమ్ హై రికార్డులకు మళ్లీ చేరువైనైట్టెంది. అక్టోబర్ 17న తులం పసిడి మునుపెన్నడూ లేనివిధంగా ఏకంగా రూ.1,34,800 పలికిన విషయం తెలిసిందే. అలాగే అక్టోబర్ 14న కిలో వెండి రూ.1,85,000కు చేరింది. ఆ తర్వాత తగ్గుముఖం పట్టినా తిరిగి ఎగిశాయి.
24 క్యారెట్ బంగారం తులం రూ.710 పెరిగి రూ.1,28,460గా ఉన్నది. 22 క్యారెట్ (99.5 స్వచ్ఛత) 10 గ్రాములు రూ.650 అందుకుని రూ.1,17,750 పలికింది. ఇక అంతర్జాతీయ మార్కెట్ విషయానికొస్తే.. ఔన్స్ గోల్డ్ 12.44 డాలర్లు పుంజుకొని 4,169.88 డాలర్లకు చేరింది. వెండి కూడా 53.81 డాలర్లుగా నమోదైంది. కాగా, గ్లోబల్ మార్కెట్ ట్రెండ్, మదుపరుల నుంచి వస్తున్న డిమాండ్‌తోనే ధరలు పెరుగుతున్నాయని అఖిల భారత సరఫా అసోసియేషన్ ప్రస్తుత సరళిని విశ్లేషిస్తున్నది.
అలాగే వచ్చే నెలలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీరేట్లను తగ్గిస్తుందన్న అంచనాలూ ఉన్నాయి. ఇవి కూడా గోల్డ్ రేట్లను ఎగదోస్తున్నాయి. కాగా, అంతర్జాతీయ బంగారం మార్కెట్లో భారత్ ధరలను అనుసరించడానికి బదులుగా ధరలను నిర్ణయించే స్థాయికి వెళ్తుందని, దేశీయంగా గోల్డ్ మైనింగ్ పెరిగితే ఇది సాధ్యమేనన్న అంచనాలు వినిపిస్తున్నాయి.