Gautam Adani | కేరళ వాయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో వందలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం శిథిలాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతున్న కొద్ది మృతుల సంఖ్య పెరుగుతూ వస్తున్నది. ఈ ఘటనపై ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ విచారం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.5కోట్ల విరాళం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన ట్వీట్ చేశారు. వయనాడ్‌లో సంభవించిన విపత్తు అనేకమంది ప్రాణాలను బలితీసుకోవడం తన మనసును కలచివేసిందన్నారు. కష్ట సమయంలో అదానీగ్రూప్ కేరళకు సంఘీభావం ప్రకటిస్తుందని పేర్కొన్నారు. ఇందులో భాగంగా కేరళ సర్కారు చేపడుతున్న సహాయక చర్యలకు మద్దతుగా రూ.5కోట్ల విరాళం అందిస్తున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా.. ఈ నెల 30న వయనాడ్‌లో భారీగా కొండచరియలు విరిగిపడిన విషయం తెలిసిందే. ఘటనలో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 200 దాటింది.
ఇప్పటి వరకు 270 మృతదేహాలను వెలికి తీసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఇప్పటి వరకు 89 మృతదేహాలను గుర్తించగా.. మరో 143 మృతదేహాలకు పోస్టుమార్టం ప్రక్రియ పూర్తయ్యింది. ఇందులో 32 మృతదేహాలకు బంధువులకు అప్పగించారు. ఇంకా శిథిలాల కింద చిక్కుకుపోయి ఉంటారనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనలో గాయపడ్డ వారిని ఆసుప్రతికి తరలించగా చికిత్స పొందుతున్నారు. మరో వైపు ప్రకృతి ప్రకోపానికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల కింద వందల సంఖ్యలో చిక్కుకుపోగా.. గల్లంతైన వారికోసం డ్రోన్లు, జాగిలాలతో అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలో శిక్షణ పొందిన ఆర్మీ శునకాలను సైతం రంగంలోకి దింపారు. బెల్జియన్ మాలినోయిస్, లాబ్రడార్, జర్మన్ షెపర్డ్ జాతికి చెందిన స్నిఫర్ డాగ్‌లను సంఘటనా స్థలానికి తరలించారు. మానవ అవశేషాలతోపాటు మట్టిలో కూరుకుపోయిన వారి శ్వాసను సైతం పసిగట్టగలిగే సామర్థ్యం వాటికి ఉన్నది.