Tech Layoffs | టెక్ రంగంలో అనిశ్చితి కొనసాగుతోంది. కృత్రిమ మేధ (AI) ప్రవేశం, దేశాల మధ్య నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు వెరసి ప్రపంచవ్యాప్తంగా ఐటీ (IT) సెక్టార్ ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నది. చిన్న కంపెనీల నుంచి మొదలుకొని దిగ్గజ టెక్ సంస్థల వరకు అన్నీ తమ కార్యకలాపాల్లో ఏఐని భాగం చేస్తూ.. మానవ వనరుల్ని క్రమంగా తగ్గించుకుంటున్నాయి. ఫలితంగా వేల సంఖ్యలో ఉద్యోగులు కొలువులను కోల్పోతున్నారు. టెక్ సెక్టార్లో కొనసాగుతున్న కొలువుల కోతలు (Layoffs) ఉద్యోగులు, వారి కుటుంబాల ఆర్థిక పరిస్థితులపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి. ఈ ఏడాది ఐటీ కంపెనీలు లక్ష మందికిపైగా ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటించినట్లు ఓ అధ్యయనంలో వెల్లడైంది.
Layoffs.fyi ప్రకారం.. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 551 టెక్ కంపెనీలు ఈ ఏడాది 1.22 లక్షల మందిని ఉద్యోగం నుంచి తొలగించాయి. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) మొదలుకొని అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఇంటెల్, సేల్స్‌ఫోర్స్, హెచ్‌పీ, యాపిల్, మెటా, గూగుల్.. వంటి పెద్దపెద్ద సంస్థలు ఖర్చు తగ్గించుకునేందుకు ఎడాపెడా ఉద్యోగులను తొలగించాయి.
ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon) ఈ ఏడాది అక్టోబర్‌లో దాదాపు 14,000 మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. కంపెనీ చరిత్రలోనే ఇదే అతిపెద్ద ఉద్యోగాల కోత. ఈ లేఆఫ్స్ ప్రభావం సంస్థలోని దాదాపు అన్ని విభాగాలపై పడింది. క్లౌడ్ సర్వీసెస్, డివైజెస్, రిటెయిల్, అడ్వర్టైజింగ్, గ్రాసరీస్ విభాగాల్లోని ఉద్యోగులు ప్రభావితమయ్యారు.
వ్యయ నియంత్రణలో భాగంగా సాఫ్ట్వేర్ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ (Microsoft) కూడా భారీగా ఉద్యోగుల తొలగించింది. ఈ ఏడాది ఏకంగా 15 వేల మందికిపైగా ఉద్యోగులపై వేటువేసింది. ఇందులో ఒక్క జులైలోనే 9 వేల మంది తమ ఉద్యోగాలు కోల్పోయారు.
కృత్రిమ మేధ (AI) రాకతో ప్రయోజనాల సంగతి ఏమోగానీ ఐటీ ఉద్యోగాలపై దీని ప్రభావం మాత్రం గట్టిగానే పడుతోంది. ఏఐ పుణ్యమా అని దిగ్గజ సంస్థలు తమ స్టాఫ్‌ను తగ్గించుకుంటున్నాయి. ఈ క్రమంలో భారత అతిపెద్ద ఐటీ కంపెనీ టీసీఎస్ (TCS) కూడా వేల సంఖ్యలో ఉద్యోగుల్ని తొలగించింది. తమ మొత్తం ఉద్యోగుల్లో 2 శాతానికి సమానమైన 12 వేల మంది ఉద్యోగులపై టీసీఎస్ వేటు వేసింది. టీసీఎస్ ప్రకటన ఐటీ ఇండస్ట్రీని ఆశ్చర్యానికి గురిచేసింది.
ప్రముఖ చిప్ తయారీ దిగ్గజం ఇంటెల్ గత కొన్ని రోజులుగా తీవ్ర ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటోంది. ఈ ఏడాది మార్చిలో ఇంటెల్ కొత్త సీఈఓగా లిప్-బు టాన్ (Lip-Bu Tan) బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ఆయన ఆధ్వర్యంలో సంస్థ భారీ పునర్వ్యవస్థీకరణ చేపడుతోంది. ఇందులో భాగంగానే పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగిస్తోంది. ఈ ఏడాది జులైలో తమ మొత్తం ఉద్యోగుల్లో 15 శాతం తగ్గించుకుంటున్నట్లు సంస్థ ప్రకటించింది. ఈ కంపెనీ ఉద్యోగుల సంఖ్య 2024 చివరికి 1,09,800 గా ఉండగా.. 2025 చివరికి 75 వేలకు పరిమితం చేయాలని నిర్ణయించుకుంది.
వీటితోపాటూ పలు సంస్థలు కూడా ఏఐ పేరుతో భారీగా కొలువల కోతకు తెగబడ్డాయి. ఏఐ వినియోగం నేపథ్యంలో 4 వేల మంది కస్టమర్ సపోర్ట్ సిబ్బందిని తొలగించినట్లు సేల్స్‌ఫోర్స్ తెలిపింది. ఏఐతోనే తమ పని ఎక్కువగా సాగుతున్నట్లు కంపెనీ సీఈఓ చెప్పుకొచ్చారు. అయితే త్వరలో మరికొంత మందిని నియమించుకునేందుకు ప్లాన్ చేస్తున్నట్లు వివరించారు. పర్సనల్ కంప్యూటర్లను తయారు చేసే హెచ్‌పీ కూడా సుమారు 6 వేల మంది వరకు ఉద్యోగుల్ని తొలగించనున్నట్లు ప్రకటించింది. యాపిల్, మెటా, గూగుల్, వెరిజోన్, సీమెన్స్ వంటి సంస్థలు కూడా భారీగా లేఆఫ్స్ ప్రకటించాయి. వెరిజోన్ 13 వేల మందికిపైగా తొలగించనున్నట్లు నవంబర్ నెలలో ప్రకటించింది. సీమెన్స్ 6వేల మందిని తొలగించనున్నట్లు తెలిపింది.
Also Read..
Elon Musk | వెండి ధరల పెరుగుదలపై ఎలాన్ మస్క్ ఆందోళన.. ఎందుకంటే..?
Aravalli Hills | ఆరావళిపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. పాత ఉత్తర్వులపై స్టే
Lalit Modi | మేం పరారీలో ఉన్న నేరస్థులం అంటూ వ్యాఖ్యలు.. క్షమాపణలు చెప్పిన లలిత్ మోదీ