ముంబై, జనవరి 8 : దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. రష్యా నుంచి ముడి చమురు కొనుగోళ్లను ఆపడం లేదని రగిలిపోతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. భారత్, చైనాలపై 500 శాతం సుంకాలకు సిద్ధమవుతున్నారన్న వార్తలు మార్కెట్ సెంటిమెంట్‌ను ఒక్కసారిగా కుప్పకూల్చాయి. ఉదయం ఆరంభం నుంచే సూచీలు అమ్మకాల ఒత్తిడిలోకి జారుకోగా.. మదుపరులు లాభాల స్వీకరణ వేగాన్ని పెంచినకొద్దీ నష్టాలు సైతం పెరుగుతూపోయాయి. ఈ క్రమంలోనే బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 780.18 పాయింట్లు లేదా 0.92 శాతం పతనమై 84,180.96 వద్ద స్థిరపడింది. ఒకానొక దశలోనైతే 851.04 పాయింట్లు దిగజారింది. నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ సైతం 263.90 పాయింట్లు లేదా 1.01 శాతం క్షీణించి 25,876.85 వద్ద నిలిచింది. ఇక గడిచిన 4 రోజుల్లో సెన్సెక్స్ 1,581.05 పాయింట్లు లేదా 1.84 శాతం దిగింది. నిఫ్టీ 451.70 పాయింట్లు లేదా 1.71 శాతం తగ్గింది.
కాగా, మెటల్, చమురు-గ్యాస్, కమోడిటీ స్టాక్స్ కుదేలయ్యాయి. విదేశీ మదుపరులు తమ పెట్టుబడులను అదేపనిగా ఉపసంహరించుకుంటుండటం, అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లూ నష్టాల్లోనే కదలాడుతుండటం కూడా దెబ్బతీసిందని మార్కెట్ నిపుణులు ట్రేడింగ్ సరళిని విశ్లేషిస్తున్నారు. బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 1.99 శాతం, స్మాల్‌క్యాప్ 1.97 శాతం నష్టపోయాయి. రంగాలవారీగా మెటల్ షేర్లు అత్యధికంగా 3.34 శాతం నష్టాలను చవిచూశాయి. చమురు-గ్యాస్ (3.15 శాతం), పవర్ (2.92 శాతం), ఎనర్జీ (2.64 శాతం), ఇండస్ట్రియల్స్ (2.36 శాతం), కమోడిటీస్ (2.36 శాతం), పీఎస్‌యూ బ్యాంక్ (2.21 శాతం), ఐటీ (2.04 శాతం), యుటిలిటీస్ (2 శాతం) షేర్లూ నిరాశపర్చాయి. షేర్లవారీగా ఎల్అండ్టీ, టెక్ మహీంద్రా, టీసీఎస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా స్టీల్, ట్రెంట్ షేర్లు భారీగా నష్టపోయాయి. ఇక ఆసియా ప్రధాన మార్కెట్లలో దక్షిణ కొరియా లాభాల్లో ముగియగా.. జపాన్, చైనా, హాంకాంగ్ సూచీలు నష్టాలకే పరిమితమయ్యాయి. ఐరోపా, అమెరికా మార్కెట్లూ నష్టాల్లోనే కదలాడుతున్నాయి.
మార్కెట్ లీడర్ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) షేర్లకు ఈ వారం గట్టి దెబ్బే తగిలింది. బీఎస్ఈలో గత 4 రోజుల్లో కంపెనీ మార్కెట్ విలువ రూ.1.65 లక్షల కోట్లు కరిగిపోయింది. ఇంకా వివరంగా చెప్పాలంటే.. రూ.1,65,299.15 కోట్లు దిగజారి రూ.19,89,679.45 కోట్లకు పరిమితమైంది. ఈ 4 రోజుల్లో సంస్థ షేర్ వాల్యూ 7.67 శాతం క్షీణించింది.
భారతీయ ఈక్విటీ మార్కెట్లు వరుసగా నాల్గోరోజూ నష్టాలకే పరిమితమయ్యాయి. గురువారం భారీ నష్టాలు.. గత నాలుగు నెలల్లో అత్యధికం. భారత్‌పై అమెరికా ప్రతీకార సుంకాలు పెద్ద ఎత్తున పెరుగుతాయన్న అంచనాలు మార్కెట్లో సెల్లింగ్ ప్రెషర్‌ను పెంచేశాయి. అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో కార్పొరేట్ ఆర్థిక ఫలితాలు అంతంతేనన్న అభిప్రాయాలూ దెబ్బతీశాయి.
భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు, అంతర్జాతీయంగా వాణిజ్యపరమైన ఆందోళనలు, మదుపరుల లాభాల స్వీకరణ వంటివి భారతీయ క్యాపిటల్ మార్కెట్లలో సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ పతనం, విదేశీ మదుపరులు తమ పెట్టుబడులను వెనుకకు తీసుకుంటుండటం తదితర పరిణామాలు కూడా ఈక్విటీ సూచీలను పడేశాయి.
స్టాక్ మార్కెట్ల వరుస నష్టాలు.. లక్షల కోట్ల రూపాయల మదుపరుల సంపదను ఆవిరి చేసేస్తున్నాయి. సెన్సెక్స్ గత 4 రోజుల్లో రూ.1,581.05 పాయింట్లు పడిపోగా.. బీఎస్ఈ నమోదిత సంస్థల మార్కెట్ విలువ రూ.9.19 లక్షల కోట్లు హరించుకుపోయింది. గురువారం ఒక్కరోజే రూ.8 లక్షల కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు స్టాక్ ఎక్సేంజీల వర్గాలు పేర్కొంటున్నాయి. మొత్తం 3,158 షేర్లు నష్టపోయాయి. మరో 1,039 షేర్లు లాభపడగా, 170 షేర్లు ఎక్కడివక్కడే ఉన్నాయి. ప్రస్తుతం బీఎస్ఈ కంపెనీల మార్కెట్ విలువ రూ.472 లక్షల కోట్లుగా ఉన్నది.