Investers Wealth | అమెరికాలో ధరలను కట్టడి చేయడానికి ఫెడ్ రిజర్వు కీలక వడ్డీరేట్లు పెంచుతామన్న ప్రకటనతో ఇన్వెస్టర్లు కుదేలయ్యారు. దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లోనే ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్ఈ) ఇండెక్స్ 861.25 పాయింట్ల (1.46 శాతం) నష్టంతో సరిపెట్టుకుంది. దీంతో సోమవారం ఒక్కరోజే ఇన్వెస్టర్లు రూ.2.39 లక్షల కోట్ల సంపద కోల్పోయారు. బీఎస్ఈలో అంతర్గత ట్రేడింగ్‌లో సెన్సెక్స్ ఒకానొక దశలో 1466.4 పాయింట్ల (2.49 శాతం) వరకు పతనమైంది. ఫలితంగా బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.రూ.2,39,781.58 కోట్లు తగ్గి రూ.2,74,56,330.02 కోట్లకు పడిపోయింది.
బీఎస్ఈ సెన్సెక్స్‌లో టెక్ మహీంద్రా అత్యధికంగా 4.57 శాతం నష్టపోయింది. ఇతర టెక్ దిగ్గజ సంస్థలు ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టాటా కన్సల్టెన్సీతోపాటు కొటక్ మహీంద్రా బ్యాంక్, టాటా స్టీల్, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నష్టాలతో ముగిశాయి. మరోవైపు మారుతి సుజుకి, ఏషియన్ పెయింట్స్, నెస్ట్లే, ఐటీసీ, మహీంద్రా అండ్ మహీంద్రా, హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్‌యూఎల్) లాభాలు గడించాయి.
ఆసియా మార్కెట్లలో సియోల్, టోక్యో, హాంకాంగ్ భారీగా నష్టపోయాయి. షాంఘై మార్కెట్ స్వల్ప లాభాలతో ముగిసింది. యూరప్ మార్కెట్లు నష్టాలతో నడుస్తున్నాయి. శుక్రవారం యూఎస్ మార్కెట్లు గణనీయ నష్టాలు చవి చూశాయి. దేశీయ మార్కెట్లలో శుక్రవారం విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐ) రూ.52.12 కోట్ల విలువైన షేర్లు విక్రయించారు.