Elon Musk | అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయం.. అమెరికన్ టైకూన్, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ (Elon Musk)కు బాగా కలిసొచ్చింది. ట్రంప్ విజయంతో మస్క్ సంపద అమాంతం పెరిగింది. దీంతో ఆయన తాజాగా ఓ సరికొత్త రికార్డు సృష్టించాడు. వ్యక్తిగత సందప పరంగా మస్క్ ఏకంగా 400 బిలియన్ డాలర్ల క్లబ్‌లోకి చేరారు. తద్వారా ప్రపంచంలోనే తొలిసారి ఈ రికార్డు నెలకొల్పిన వ్యక్తిగా నిలిచారు.
బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ సూచీ (Bloomberg Billionaires Index) నివేదిక ప్రకారం.. స్పేస్ఎక్స్ (SpaceX)లోని అంతర్గత వాటా విక్రయంతో మస్క్ సంపద దాదాపు 50 బిలియన్ డాలర్లు పెరిగింది. దీంతో ఆయన మొత్తం నికర విలువ 439.2 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ప్రపంచంలో ఇప్పటి వరకు ఎవరూ కూడా 400 బిలియన్ డాలర్ల క్లబ్‌లోకి చేరిన దాఖలాలు లేవు. ఇప్పుడు ఆ ఘనత సాధించిన ఏకైక వ్యక్తిగా మస్క్ చరిత్ర సృష్టించారు.
2022లో మస్క్ సంపద 200 బిలియన్ డాలర్ల కంటే దిగవుకు పడిపోయింది. అయితే, ఇటీవలే జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలతో అంతా మారిపోయింది. ఈ ఎన్నికల్లో ట్రంప్ విజయం మస్క్‌కు బూస్ట్ ఇచ్చిందనే చెప్పాలి. ట్రంప్ విజయం సాధించినప్పటి నుంచి మస్క్ నికర విలువ పెరుగుతూ వస్తోంది. అధ్యక్ష ఎన్నికల ఫలితాల తర్వాత నుంచి ఇప్పటి వరకు టెస్లా షేర్లు ఏకంగా 65 శాతం పెరగడం విశేషం.
ఇక మస్క్‌కు చెందిన ఆర్ట్ఫిషియల్ స్టార్టప్ ఎక్స్ఏఐ గత మే నుంచి నిధుల సేకరణ ప్రారంభించింది. దీంతో దాని విలువ రెండింతలై 50 బిలియన్ డాలర్లకు చేరింది. నిన్న స్పేస్ఎక్స్ దాని పెట్టుబడి దారులు ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. 1.25 బిలియన్ డాలర్ల విలువగల షేర్లను స్పేస్ఎక్స్ ఉద్యోగులు, కంపెనీ ఇన్సైడర్ నుంచి కొనుగోలు చేసేందుకు ఒప్పందం చేసుకున్నారు. దీంతో స్పేస్ఎక్స్ 350 బిలియన్ డాలర్ల విలువకు చేరింది. ఫలితంగా ప్రంపంచలోనే అత్యంత విలువైన ప్రైవేట్ స్టార్టప్‌గా స్పేస్ఎక్స్ రికార్డు నెలకొల్పింది.
Also Read..
GDP | ఈసారి వృద్ధి 6.5 శాతమే.. భారత జీడీపీ అంచనాలకు ఏడీబీ కోత
Coca Cola | కోక్ బాట్లింగ్‌లో జుబిలెంట్కు వాటా