ముంబై, డిసెంబర్ 11: నమ్మకం, వృద్ధి, స్థిరత్వంపై ప్రధానంగా దృష్టి పెడుతానని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కొత్త గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రమాణం చేశారు. బుధవారం ఉదయం 10 గంటలకు ఆయన ఆర్బీఐకి 26వ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆయన వెంట డిప్యూటీ గవర్నర్లు ఎం రాజేశ్వర్ రావు, టీ రవి శంకర్, స్వామినాథన్ జే కూడా ఉన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. దేశ ప్రజల ప్రయోజనాలకే పెద్దపీట వేస్తానని మాటిస్తున్నట్టు చెప్పారు. ‘నిత్యం భౌగోళిక ఉద్రిక్తతలు, వాతావరణ మార్పులు, రాజకీయ అనిశ్చిత పరిస్థితులున్న ప్రపంచంలో ప్రస్తుతం మనం ఉన్నాం. ఈ క్రమంలో సవాళ్లను ఎదుర్కోవడానికి ఆర్బీఐ అప్రమత్తంగా, చురుగ్గా ఉండాల్సిన అవసరం ఉన్నది’ అని అన్నారు. అలాగే దేశ ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించడం అన్నది పెద్ద బాధ్యతగా పేర్కొన్నారు.
సంక్లిష్ట సమయం..
దేశ జీడీపీ వృద్ధిరేటు 7 త్రైమాసికాల కనిష్ఠానికి పతనం కావడం, డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ రికార్డు స్థాయిలకు నష్టపోతుండటం, ఆమోదయోగ్య పరిమితిని మించి ద్రవ్యోల్బణం విజృంభిస్తుండటం, దేశీయ ఫారెక్స్ రిజర్వులు క్రమేణా క్షీణిస్తుండటం వంటి సంక్లిష్ట పరిస్థితుల్లో ఆర్బీఐ గవర్నర్‌గా సంజయ్ మల్హోత్రా వచ్చారు. దీంతో ఆయనకు ఈ బాధ్యత కత్తిమీద సామే అనడంలో సందేహం లేదు.
ఫిబ్రవరిలో తొలి ద్రవ్యసమీక్ష
ఆర్బీఐ నూతన గవర్నర్ సంజయ్ మల్హోత్రా అధ్యక్షతన తొలి ద్రవ్యసమీక్ష వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరుగనున్నది. ద్రవ్యోల్బణం దృష్ట్యా గత ఏడాది ఏప్రిల్ నుంచి రెపోరేటును గరిష్ఠంగా 6.5 శాతం వద్దే ఆర్బీఐ ఉంచుతూ వస్తున్న సంగతి విదితమే. కాగా, వడ్డీరేట్లు ఇప్పట్లో తగ్గే వీల్లేదని యాక్సిస్ బ్యాంక్ ప్రధాన ఆర్థికవేత్త నీల్కాంత్ మిశ్రా అంటున్నారు. రాబోయే ద్రవ్యసమీక్షలోనేగాక, వచ్చే ఆర్థిక సంవత్సరం (2025-26) మొత్తంగా కూడా రెపోరేటు తగ్గకపోవచ్చనే చెప్తున్నారు. ఇందుకు కారణం ద్రవ్యోల్బణమేనని ఆయన పేర్కొంటున్నారు.