GDP | న్యూఢిల్లీ, డిసెంబర్ 11: భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటు అంచనాకు ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఏడీబీ) కోత పెట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25) దేశ జీడీపీ వృద్ధి 6.5 శాతానికే పరిమితం కావచ్చని బుధవారం పేర్కొన్నది. గతంతో పోల్చితే ఈ అంచనా అర శాతం తక్కువ కావడం గమనార్హం. మునుపు ఈ ఆర్థిక సంవత్సరం భారత్ జీడీపీ 7 శాతం వృద్ధి చెందగలదని అంచనా వేసింది మరి. ఈ మేరకు ఏషియన్ డెవలప్మెంట్ ఔట్లుక్ (ఏడీవో) తాజా ఎడిషన్‌లో ఏడీబీ స్పందించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కూడా దేశ జీడీపీ అంచనాల్ని భారీగా తగ్గించిన విషయం తెలిసిందే. ఈసారి 7.2 శాతం కాదు 6.6 శాతమేనన్నది. అంతేగాక ఈ ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యోల్బణం అంచనాను సైతం 4.8 శాతానికి పెంచింది. మందగించిన ఆర్థిక పరిస్థితులు, అధిక ఆహారోత్పత్తుల ధరలే కారణమని వివరించింది. ఈ నేపథ్యంలో ఏడీబీ అంచనాలు మిక్కిలి ప్రాధాన్యాన్ని సంతరించుకుంటున్నాయి.
వచ్చేసారీ నిరాశే
వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2025-26)గాను దేశ జీడీపీ వృద్ధిరేటు అంచనాల్ని సైతం ఏడీబీ తగ్గించేసింది. 7 శాతానికి మించి నమోదు కాకపోవచ్చన్న అభిప్రాయాన్ని వెలిబుచ్చింది. గతంలో 7.2 శాతం వృద్ధిరేటు ఉండొచ్చని అంచనా వేసిన సంగతి విదితమే. అలాగే ఆసియా-పసిఫిక్ దేశాల జీడీపీ కూడా 4.9 శాతానికి తగ్గవచ్చన్నది. సెప్టెంబర్‌లో దీన్ని 5 శాతంగా అంచనా వేసింది. కాగా, ఈ జూలై-సెప్టెంబర్‌లో భారత జీడీపీ వృద్ధి 7 త్రైమాసికాల కనిష్ఠాన్ని తాకుతూ 5.4 శాతం వద్దే నిలిచింది. నిజానికి ఆర్బీఐ అంచనా 7 శాతంగా ఉన్నది. మరోవైపు ఎస్అండ్పీ తదితర గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీలు కూడా భారత జీడీపీ వృద్ధి అంచనాలకు కత్తెర వేస్తున్నాయి.
ఇదీ సంగతి..
ఈసారైనా.. వచ్చేసారైనా దేశ జీడీపీ వృద్ధి తగ్గిపోవచ్చని అంచనా వేయడానికి కారణం ప్రైవేట్ పెట్టుబడులు, హౌజింగ్ డిమాండ్‌లో ఆశించిన స్థాయిలో ప్రగతి లేకపోవడమేనని ఏడీబీ ఈ సందర్భంగా తెలియజేసింది. అమెరికా వాణిజ్యం, ఆ దేశ ఆర్థిక వ్యవస్థ, దాని వలస విధానాల్లో చోటుచేసుకోబోయే మార్పులూ.. భారత్‌కు ప్రతికూలంగా మారవచ్చని ఏడీబీ అభిప్రాయపడింది. వచ్చే ఏడాది జనవరిలో అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టనున్నది తెలిసిందే. ఇక అభివృద్ధి చెందుతున్న ఆసియా దేశాలతోపాటు, పసిఫిక్ దేశాల్లో ఎగసిపడుతున్న ద్రవ్యోల్బణం కూడా జీడీపీ వృద్ధికి అవరోధమేనని ఏడీబీ తమ తాజా రిపోర్ట్‌లో వ్యాఖ్యానించింది. అయితే ఖరీఫ్‌లో పంట దిగుబడి పెరిగితే ద్రవ్యోల్బణం శాంతించవచ్చని, బ్రెంట్ ముడిచమురు ధరలూ తక్కువగానే ఉంటే భారత్‌కు లాభిస్తుందన్న అభిప్రాయాన్ని వెలిబుచ్చింది.