న్యూఢిల్లీ, నవంబర్ 10: దేశీయ ఆటో రంగ దిగ్గజం, ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ పవన్ కాంత్ ముంజల్కు చెందిన ఆస్తులను శుక్రవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. ఇతరుల పేరిట జారీ అయిన విదేశీ కరెన్సీ (ఫారెక్స్)ని పవన్ ముంజల్ విదేశాల్లో తన వ్యక్తిగత అవసరాల కోసం ఖర్చు చేశారని ఈడీ ఆరోపించింది. తద్వారా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిబంధనలను ఆయన అతిక్రమించారన్న ఈడీ.. మనీ లాండరింగ్ దర్యాప్తులో భాగంగా ముంజల్కు చెందిన రూ.24.95 కోట్ల ఆస్తులను అటాచ్ చేసింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద ఢిల్లీలోని మూడు స్థిరాస్తులను జప్తు చేసినట్టు ఈ సందర్భంగా విడుదల చేసిన ఓ ప్రకటనలో ఈడీ పేర్కొన్నది. కాగా, ముంజల్ వ్యక్తిగత, వ్యాపార పర్యటనల్లో ఆయన రిలేషన్షిప్ మేనేజర్.. నగదు/కార్డు రూపంలో విదేశీ కరెన్సీని పట్టుకు తిరిగారని, దాన్ని ఆయా సందర్భాల్లో ముంజల్ కోసం ఖర్చు చేశారని ఈడీ వివరించింది. పీఎంఎల్ఏ కింద ముంజల్పై క్రిమినల్ కేసును నమోదు చేసిన ఈడీ.. ఈ ఏడాది ఆగస్టులోనే ఆయన కార్యాలయాలపై దాడులు చేపట్టింది. అప్పుడు కూడా రూ.25 కోట్ల ఆస్తులను స్వాధీనం చేసుకున్నది. ఇక ఇదే వ్యవహారంలో ముంజల్పై డైరెక్టరేట్ ఆఫ్ రెవిన్యూ ఇంటిలిజెన్స్ (డీఆర్ఐ) దాఖలు చేసిన చార్జిషీట్ ఆధారంగా ఈ కేసును ఈడీ నమోదు చేసింది. హీరో మోటోకార్ప్ సీఎండీగా కూడా పవన్ కాంత్ ముంజల్ వ్యవహరిస్తుండగా, ఆ సంస్థకు ఆసియా, ఆఫ్రికా, దక్షిణ, మధ్య అమెరికాల్లోని 40 దేశాల్లో వ్యాపార కార్యకలాపాలున్నాయి.