Donald Trump | న్యూఢిల్లీ, మార్చి 7 : అమెరికా అధ్యక్షుడి పోకడ.. ఆయా దేశాల్లో పెద్ద ఎత్తునే ఉద్యోగుల ఉసురు తీసేలా ఉన్నది. ఆ జాబితాలో భారత్ కూడా కనిపిస్తుండటం ఆందోళన కలిగిస్తున్న అంశం. అవును.. ఇప్పటికే ద్రవ్యోల్బణం, తయారీసహా కీలక రంగాల్లో నిస్తేజం, జీడీపీ వృద్ధిరేటు మందగమనం, అధిక వడ్డీరేట్ల వంటి సమస్యలతో సతమతమవుతున్న దేశీయ వ్యాపార, పారిశ్రామిక రంగాన్ని ఇప్పుడు అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ సుంకాల హెచ్చరికలు భయపెడుతున్నాయి. ఏప్రిల్ 2 నుంచి భారత్‌పై సుంకాలుంటాయంటున్న ట్రంప్ ప్రకటనలు నిజమైతే.. ఇండస్ట్రీ కుదేలవడం ఖాయమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతుండటం గమనార్హం. ముఖ్యంగా భారతీయ తయారీ, ఎగుమతుల రంగాలకు గట్టి ఎదురుదెబ్బేనంటున్నారు.
‘ఈ ఇంటికి ఆ ఇల్లు ఎంత దూరమో.. ఆ ఇంటికి ఈ ఇల్లూ అంతే దూరం’ అంటున్నారు యూఎస్ బాస్ ట్రంప్. దీంతో ఆయా రంగాల్లో ఇప్పుడు అమెరికా వస్తూత్పత్తులపై భారత్ విధిస్తున్న సుంకాలకు తగ్గట్టుగా భారతీయ వస్తూత్పత్తులపై అమెరికా సుంకాలను వేయనున్నది. భారతీయ రత్నాలు, ఆభరణాల పరిశ్రమ విషయానికే వస్తే.. ట్రంప్ సుంకాల ప్రభావం దీనిపై భారీగానే ఉండే వీలున్నది. ప్రస్తుతం భారతీయ నగలకు అమెరికాలో మంచి డిమాండ్ ఉన్నది. దీంతో అక్కడికి మన ఎగుమతులు భారీగానే జరుగుతున్నాయి. అయితే సుంకాలు పెంచితే వీటి ధరలు అమాంతం పెరిగిపోతాయి. దాంతో వ్యాపారాలకు దెబ్బే. అమెరికా నుంచి భారత్‌కు వస్తున్న జ్యుయెల్లరీపై వాటి విలువలో కేంద్ర ప్రభుత్వం 20 శాతాన్ని సుంకాలుగా వసూలు చేస్తున్నది. కానీ భారత్ నుంచి అమెరికాకు చేరుతున్న నగలపై అక్కడ పడుతున్నది గరిష్ఠంగా 5.5-7 శాతమే. ఇక సానబెట్టిన వజ్రాలపై ఇక్కడ 5 శాతం సుంకం పడితే.. అమెరికాలో ఏమీ లేదు. ఈ లెక్కన ట్రంప్ హెచ్చరించినట్టుగా సుంకాలు పడితే జెమ్స్ అండ్ జ్యుయెల్లరీ ఇండస్ట్రీ కుదేలైనట్టే. దేశంలో 2 లక్షలకుపైగా జనాభా ఈ రంగం ద్వారా ఉపాధి పొందుతున్నది. వీరిలో మహిళలే ఎక్కువ. ఇప్పుడు టారిఫ్‌ల సెగ వీరందరికీ తగులుతున్నట్టే. ఇలాగే అనేక రంగాల పరిస్థితి నెలకొన్నది.
భారతీయ ఐటీ రంగానికున్న ప్రధాన మార్కెట్లలో అమెరికా ఒకటి. అయితే తొలిసారి అగ్రరాజ్య అధ్యక్షుడైనప్పుడే దేశీయ ఐటీ రంగాన్ని ట్రంప్ తీవ్రంగా దెబ్బతీశారు. వీసా నిబంధనలు కఠినతరం, ప్రాజెక్టుల్ని దూరం చేయడం, అమెరికాలో అమెరికన్లతోనే పనిచేయించాలనడం వంటివి ఇండియన్ ఐటీ ఇండస్ట్రీకి ఇబ్బందుల్ని తెచ్చిపెట్టాయి. ఇక్కడి ఐటీ ఉద్యోగ నియామకాలనూ ప్రభావితం చేశాయి. అమెరికాలోనూ భారతీయులకు ఉద్యోగాలు తగ్గిపోయాయి. మళ్లీ ఇప్పుడు ట్రంప్ రావడంతో ఐటీ రంగంలోనూ ప్రకంపనలు మొదలవుతున్నాయి. ఇప్పటికే ఏఐ దెబ్బకు రిక్రూట్మెంట్లు మందగించిన విషయం తెలిసిందే. మొత్తానికి ట్రంప్.. ప్రధాని మోదీకి మధ్య సత్సంబంధాలే ఉన్నప్పటికీ.. దేశ ప్రయోజనాలే ముందు అంటున్నారు ట్రంప్. నిజానికి అమెరికా మోటర్‌సైకిళ్లు, విస్కీలపై 20 నుంచి 50 శాతం మేర సుంకాలను కేంద్రం తగ్గించింది. మరికొన్నింటిపైనా సమీక్ష జరుపుతున్నది. మరోవైపు వాణిజ్య మంత్రి గోయల్ అమెరికాలో చర్చల కోసం వెళ్లారు. ఇవన్నీ ఏ మేరకు ఫలిస్తాయో చూడాల్సిందే.
ఇటీవలికాలంలో జాబ్‌మార్కెట్ అల్లకల్లోలంగానే తయారైంది. కృత్రిమ మేధస్సు (ఏఐ) దెబ్బకు ఉద్యోగావకాశాలు భారీగానే కోల్పోవాల్సి వస్తున్నది. దీనికితోడు దేశ, విదేశీ ప్రతికూల పరిస్థితులతో కంపెనీల ఆదాయాలు, లాభాలు తగ్గుముఖం పట్టాయి. ఫలితంగా కొత్త నియామకాలు అంతంతమాత్రంగానే తయారయ్యాయి. ఈ నేపథ్యంలో అమెరికా సుంకాలను పెంచితే.. ఆ ప్రభావం అక్కడి మార్కెట్లో మన వస్తువులకున్న డిమాండ్‌ను తప్పక ప్రభావితం చేయగలదు. ఇదే జరిగితే ఇక్కడి నుంచి అక్కడికి ఎగుమతులు పడిపోయి.. ఉత్పత్తి మందగిస్తుంది. దాంతో అంతిమంగా నష్టపోయేది ఉద్యోగులేనన్నది మార్కెట్ నిపుణుల విశ్లేషణ. నిజానికి కరోనా ప్రభావం నుంచి ఇప్పుడిప్పుడే మార్కెట్ కోలుకుంటున్నది. ఈ సమయంలో ట్రంప్ సుంకాల పిడుగు అంగట్లో గట్టిగానే అలజడులను సృష్టిస్తున్నదని చెప్పవచ్చు.