ముంబై, సెప్టెంబర్ 24: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం సరికొత్త స్థాయిలను తాకాయి. బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ తొలిసారి 85,000 మార్కును దాటింది. ఒకానొక దశలోనైతే 234.62 పాయింట్లు పుంజుకొని 85,163.23 వద్దకు చేరింది. అయినప్పటికీ అమ్మకాల ఒత్తిడితో చివరకు 14.57 పాయింట్లు పడిపోయి 84,914.04 దగ్గర స్థిరపడింది. దీంతో వరుస మూడు రోజుల లాభాల పరుగులకు బ్రేక్ పడినైట్టెంది. ఇక నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ కూడా మొదటిసారి 26,000 మార్కును అధిరోహించింది. ఇంట్రా-డేలో 72.5 పాయింట్లు ఎగిసి 26,011.55 పాయింట్లకు వెళ్లింది. అయితే లాభాల స్వీకరణ కారణంగా కిందికి రాక తప్పలేదు. ఆఖర్లో 1.35 పాయింట్లు పెరిగి 25,940.40 వద్ద నిలిచింది. నిఫ్టీకిదే గరిష్ఠ ముగింపు కావడం గమనార్హం.
స్టాక్ మార్కెట్లు ఆల్‌టైమ్ హై రికార్డుల వద్ద ఉండటంతో మదుపరులు ఊగిసలాటకు గురయ్యారు. ఈ క్రమంలోనే కొనుగోళ్లు, అమ్మకాల మధ్య సూచీలు తీవ్ర ఒడిదొడుకులకు లోనయ్యాయి. ఒక దశలో సెన్సెక్స్ 84,716.07 పాయింట్ల కనిష్ఠాన్ని నమోదు చేసింది. ఎఫ్ఎంసీజీ, కొన్ని బ్యాంకింగ్ షేర్లలో లాభాల స్వీకరణ జరిగింది. అయితే చైనా తమ దేశ ఆర్థిక వ్యవస్థను ఉత్తేజపర్చడానికి ప్రకటించిన ఉద్దీపనలతో మెటల్ షేర్లకు గిరాకీ కనిపించింది. కానీ హిందుస్థాన్ యునిలివర్, అల్ట్రాటెక్ సిమెంట్, కొటక్ మహీంద్రా బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, టైటాన్, నెస్లే, బజాజ్ ఫైనాన్స్, ఏషియన్ పెయింట్స్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు భారీగా నష్టపోవడం సెన్సెక్స్‌కు లాభాలను దూరం చేసింది.
రంగాలవారీగా చూస్తే.. ఎఫ్ఎంసీజీ, టెలికం, సర్వీసెస్, ఆర్థిక సేవలు, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, బ్యాంకింగ్ షేర్లు 0.75 శాతం నుంచి 0.30 శాతం వరకు క్షీణించాయి. కాగా, మెటల్, పవర్, యుటిలిటీస్, కమోడిటీస్, ఇండస్ట్రియల్స్ షేర్లు 1.38 శాతం నుంచి 0.47 శాతం మేర పుంజుకున్నాయి. అలాగే బీఎస్ఈ మిడ్‌క్యాప్ 0.21 శాతం, స్మాల్‌క్యాప్ 0.04 శాతం పెరిగాయి.
ఆసియా మార్కెట్లలో దక్షిణ కొరియా, జపాన్, చైనా, హాంకాంగ్ సూచీలు లాభాల్లో ముగిశాయి. షాంఘై, హాంకాంగ్ సూచీలు భారీ ఎత్తున పెరగడం విశేషం. ఐరోపా మార్కెట్లలోనూ బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ సూచీలు లాభాల్లోనే కదలాడుతున్నాయి. విదేశీ సంస్థాగత మదుపరులు (ఎఫ్ఐఐ) భారతీయ స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులపట్ల ఆసక్తినే కనబరుస్తున్నారు. ‘అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీరేట్ల కోతలు.. దేశీయ స్టాక్ మార్కెట్లను రికార్డుల్లో నడిపిస్తున్నాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రిసెర్చ్ అధిపతి వినోద్ నాయర్ అన్నారు. చైనా సెంట్రల్ బ్యాంక్ వడ్డీరేట్ల కోతలు, ఆ దేశ ఉద్దీపనలు కూడా విదేశీ మదుపరులను పెట్టుబడుల వైపు తీసుకెళ్తున్నాయని అభిప్రాయపడ్డారు.