ముంబై, జనవరి 9: దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం భారీ నష్టాలకు లోనయ్యాయి. మార్కెట్ హెవీ వెయిట్ షేైర్లెన హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టీసీఎస్, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం (2024-25) మూడో త్రైమాసికానికి (అక్టోబర్-డిసెంబర్)గాను ప్రకటించే ఆర్థిక ఫలితాలు ఎలా? ఉంటాయోనన్న భయాందోళనలు మదుపరులను వెంటాడాయి. అలాగే తరలిపోతున్న విదేశీ పెట్టుబడులు సైతం మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి.
పేలవమైన చైనా రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాలు, అమెరికా బాండ్లలో అమ్మకాల ఒత్తిడి కూడా నష్టపర్చాయి. ఈ క్రమంలోనే అంతా పెట్టుబడుల ఉపసంహరణకు తెగబడ్డారు. దీంతో బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 528.28 పాయింట్లు లేదా 0.68 శాతం పడిపోయి 78వేల మార్కుకు దిగువన 77,620.21 వద్ద స్థిరపడింది. ఒకానొక దశలో 605.57 పాయింట్లు క్షీణించడం గమనార్హం. ఇక నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ కూడా 162.45 పాయింట్లు లేదా 0.69 శాతం దిగజారి 23,526.50 వద్ద ముగిసింది.
టాటా స్టీల్, జొమాటో, ఎల్అండ్టీ, టాటా మోటర్స్, అదానీ పోర్ట్స్, టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎన్టీపీసీ షేర్లు ప్రధానంగా సెన్సెక్స్‌లో నష్టాలను చవిచూశాయి. దేశీయ ఐటీ రంగ దిగ్గజ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) అక్టోబర్-డిసెంబర్‌కుగాను 11.95 శాతం వృద్ధితో రూ.12,380 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. అయితే మార్కెట్ ముగిశాక ఈ ఆర్థిక ఫలితాలు వెలువడ్డాయి. దీంతో ఆ షేర్‌పై ఈ ప్రభావం లేకుండాపోయింది. ఇక నెస్లే, హిందుస్థాన్ యునీలివర్, ఎంఅండ్ఎం, కొటక్ మహీంద్రా బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, భారతీ ఎయిర్టెల్ షేర్లు పుంజుకున్నాయి.
రియల్టీ 2.90 శాతం, చమురు-గ్యాస్ 2.19 శాతం, ఎనర్జీ 1.83 శాతం, పవర్ 1.68 శాతం, క్యాపిటల్ గూడ్స్ 1.54 శాతం, బీఎస్ఈ ఫోకస్డ్ ఐటీ 1.14 శాతం చొప్పున నష్టపోయాయి. బీఎస్ఈ స్మాల్‌క్యాప్ 1.17 శాతం, మిడ్‌క్యాప్ 0.96 శాతం మేరకు పడిపోయాయి. కాగా, ఆసియా మార్కెట్లలో దక్షిణ కొరియా, జపాన్, చైనా, హాంకాంగ్ సూచీలు నష్టపోయాయి. ఐరోపా మార్కెట్లూ మిశ్రమంగా ట్రేడ్ అవుతున్నాయి.