ముంబై, నవంబర్ 20: దేశీయ స్టాక్ మార్కెట్లు కదంతొక్కాయి. వరుసగా రెండోరోజు గురువారం సూచీలు మరో చారిత్రక గరిష్ఠ స్థాయికి చేరువయ్యాయి. చమురు, గ్యాస్ రంగ షేర్లతోపాటు పలు ఆర్థిక రంగ షేర్లకు లభించిన మద్దతుకుతోడు విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారీగా నిధులను కుమ్మరించడం సూచీలకు కలిసొచ్చింది. ఇంట్రాడేలో 600 పాయింట్లకు పైగా పెరిగిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు మార్కెట్ ముగిసే సమయానికి 446.21 పాయింట్లు అందుకొని 85,632.68 పాయింట్ల వద్ద నిలిచింది. దీంతో సూచీ 52 వారాల గరిష్ఠ స్థాయి తాకినట్టు అయింది. మరో సూచీ నిఫ్టీ 52 వారాల గరిష్ఠ స్థాయిని అధిగమించింది. చివరకు 139.50 పాయింట్లు ఎగబాకి 26,192.15 వద్ద స్థిరపడింది. అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ల ర్యాలీ కారణంగా సూచీల్లో జోష్ పెంచిందని దలాల్‌స్ట్రీట్ వర్గాలు వెల్లడించాయి.
సూచీల్లో అత్యధికంగా బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టెక్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్ షేర్లు ఒక్క శాతానికి పైగా లాభపడ్డాయి. వీటితోపాటు అల్ట్రాటెక్ సిమెంట్, పవర్‌గ్రిడ్, ట్రెంట్, అదానీ పోర్ట్స్, ఐటీసీ, ఎల్అండ్టీ, మారుతి, ఎటర్నల్ షేర్లు కూడా స్వల్పంగా పెరిగాయి. కానీ, ఏషియన్ పెయింట్స్, హెచ్‌సీఎల్ టెక్నాలజీ, టైటాన్, హెచ్‌యూఎల్, కొటక్ బ్యాంక్, టాటా స్టీల్, సన్‌ఫార్మా, టాటామోటర్స్ ప్యాసింజర్ వెహికల్, ఇన్ఫోసిస్, మహీంద్రా, బీఈఎల్, భారతీ ఎయిర్టెల్, ఎస్బీఐ, టీసీఎస్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు నష్టపోయాయి. రంగాలవారీగా ఎనర్జీ, ఫైనాన్షియల్ సర్వీసెస్, క్యాపిటల్ గూడ్స్, ఆటో, బ్యాంకింగ్, ఇండస్ట్రియల్స్, ఆయిల్ అండ్ గ్యాస్ రంగ షేర్లకు మదుపరుల నుంచి మద్దతు లభించగా…కన్జ్యూమర్ డ్యూరబుల్, టెలికాం, ఐటీ, టెక్నాలజీ, రియల్టీ రంగ షేర్లు నష్టపోయాయి.
రిలయన్స్ మరో రికార్డును సృష్టించింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.21 లక్షల కోట్లకు చేరుకున్నది. గడిచిన కొన్ని రోజులుగా కంపెనీ షేరు ధర భారీగా పెరుగుతుండటంతో ఈ రికార్డు మైలురాయికి చేరుకోవడానికి దోహదపడింది. గురువారం కూడా కంపెనీ షేరు ధర 2.42 శాతం లాభపడి రూ.1,550.90కి చేరుకున్నది. దీంతో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ రూ.20.98 లక్షల కోట్లకు చేరుకున్నది. గడిచిన ఏడాదికాలంలో కంపెనీ షేరు ధర 25 శాతం ఎగబాకగా, రెండేండ్లలో 32 శాతం పుంజుకున్నది.