ముంబై, జూన్ 20: దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస నష్టాలకు విరామం పడింది. గడిచిన మూడు రోజులుగా నష్టపోయిన సూచీలకు ఆర్థిక, టెలికాం, టెక్నాలజీ రంగ షేర్ల నుంచి లభించిన మద్దతుతో తిరిగి కోలుకున్నాయి. ఇరాన్-ఇజ్రాయిల్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో గడిచిన కొన్ని రోజులుగా భారీగా పెరిగిన క్రూడాయిల్ ధరలు తగ్గుముఖం పట్టడం కూడా సూచీలు పుంజుకోవడానికి పరోక్షంగా దోహదపడ్డాయి.
వీటికితోడు విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారీగా నిధులు కుమ్మరించడంతో వారాంతం ట్రేడింగ్లో ఇరు సూచీలు ఒక్క శాతానికి పైగా ఎగబాకాయి. ఇంట్రాడేలో 1,100 పాయింట్లకు పైగా ఎగబాకిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ 82 వేల పాయింట్ల మైలురాయిని మళ్లీ అధిగమించింది. చివరకు మార్కెట్ ముగిసే సమయానికి 1,046.30 పాయింట్లు లేదా 1.29 శాతం లాభపడి 82,408.17 వద్ద స్థిరపడింది.
నిఫ్టీ మరో మైలురాయిని అధిగమించింది. కొనుగోళ్ల ఉత్సాహంతో ఎన్ఎస్ఈ నిఫ్టీ 319.15 పాయింట్లు లేదా 1.29 శాతం అందుకొని 25,112.40 వద్ద నిలిచింది. మొత్తంమీద ఈ వారంలో సెన్సెక్స్ 1,289.57 పాయింట్లు లేదా 1.58 శాతం, నిఫ్టీ 393.8 పాయింట్లు లేదా 1.59 శాతం చొప్పున అధికమయ్యాయి.