ముంబై, ఆగస్టు 8 : దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై దిగుమతి సుంకాలను 50 శాతానికి పెంచడం, అందులో 25 శాతం అమల్లోకి రావడం.. మదు పరులను తీవ్రంగా కలవరపెట్టింది. ఈ క్రమంలోనే ఉదయం ఆరంభం నుంచే సూచీలు నేలచూపులు చూస్తూ వచ్చాయి. ట్రేడింగ్ ముగిసేదాకా ఇదే ట్రెండ్ కొనసాగింది. ఫలితంగా బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 765.47 పాయింట్లు లేదా 0.95 శాతం పడిపోయి 80వేల దిగువన 79,857.79 వద్ద ముగిసింది. ఒకానొక దశలో 847.42 పాయింట్లు దిగజారడం గమనార్హం. నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ సైతం 232.85 పాయింట్లు లేదా 0.95 శాతం కోల్పోయి 24,363.30 వద్ద స్థిరపడింది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, కొటక్ మహీ ంద్రా బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటర్స్ వంటి మార్కెట్ హెవీవెయిట్ షేర్లు మదుపరులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాయి. దీంతో నష్టాలు మరింత పెరిగాయి. ఇక నిన్నమొన్నటిదాకా పెట్టుబడుల ఉపసంహరణలకే మొగ్గుచూపిన విదేశీ సంస్థాగత మదుపరులు (ఎఫ్ఐఐ).. కొనుగోళ్లకు మద్దతు పలికినా నష్టాలను అడ్డుకోలేకపోయారు. రంగాలవారీగా.. రియల్టీ (2.09 శాతం), టెలికమ్యూనికేషన్స్ (1.83 శాతం), మెటల్ (1.82 శాతం), కన్జ్యూమర్ డ్యూరబుల్స్ (1.68 శాతం), క్యాపిటల్ గూడ్స్ (1.62 శాతం), కమోడిటీస్ (1.55 శాతం) నిరాశపర్చాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్ 1.56 శాతం, స్మాల్‌క్యాప్ 1.03 శాతం చొప్పున పతనమయ్యాయి.
ఆసియా మార్కెట్లలో జపాన్ సూచీ లాభపడగా, దక్షిణ కొరియా, చైనా, హాంకాంగ్ సూచీలు నష్టపోయాయి. అయితే ఐరోపా ప్రధాన సూచీలు లాభాల్లో సాగాయి. గురువారం అమెరికా సూచీలు మిశ్రమంగా ముగిశాయి. కాగా, ఆసియా మార్కెట్లలో మెజారిటీ సూచీలు నష్టాల్లో సాగడం కూడా భారతీయ మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసినట్టు చెప్తున్నారు. నిజానికి ఓవరాల్‌గా చూసినైట్టెతే గత ఆరు వారాలుగా దేశీయ సూచీలు నష్టాలకే పరిమితమవుతున్నాయి. ఈ వారం మొత్తంగా సెన్సెక్స్ 742.12 పాయింట్లు లేదా 0.92 శాతం, నిఫ్టీ 202.05 పాయింట్లు లేదా 0.82 శాతం దిగజారాయి. ట్రంప్ టారిఫ్‌లను ప్రకటించిన దగ్గర్నుంచి ఇన్వెస్టర్లు ప్రత్యామ్నాయ మార్గాలను తమ పెట్టుబడుల కోసం అన్వేషిస్తున్నారు మరి.
భారతీయ స్టాక్ మార్కెట్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. అమెరికా సుంకాలు, తద్వారా దేశ జీడీపీ వృద్ధిరేటు పతనం అంచనాలు.. ఇన్వెస్టర్లను పెట్టుబడులకు దూరం చేస్తున్నాయి.
మదుపరులను టారిఫ్ భయాలు చుట్టుముట్టాయి. దేశ ఆర్థిక వ్యవస్థపై బెంగ పట్టుకున్నది. మరోవైపు విదేశీ మదుపరులు కూడా పెట్టుబడుల ఉపసంహరణలకే పెద్దపీట వేస్తుండటం పరిస్థితిని మరింతగా దిగజార్చుతున్నది. అందుకే మార్కెట్లలో నష్టాలు పెరుగుతున్నాయి.