ముంబై, అక్టోబర్ 11: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుస నష్టాల్లో కొనసాగుతున్నాయి. మూడోరోజూ అమ్మకాల ఒత్తిడినే ఎదుర్కొన్నాయి. దీంతో మంగళవారం మదుపరుల సంపద రూ.4.3 లక్షల కోట్లు ఆవిరైపోయింది. బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 843.79 పాయింట్లు లేదా 1.46 శాతం క్షీణించి 57,147.32 వద్ద ముగియగా, బీఎస్ఈ నమోదిత సంస్థల మార్కెట్ విలువ రూ.270 లక్షల కోట్లకు దిగజారింది. నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ సైతం 257.45 పాయింట్లు లేదా 1.49 శాతం పడిపోయి 16,983.55 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్ షేర్లలో ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్ విలువ అత్యధికంగా 3.7 శాతం పతనమైంది. నెస్లే ఇండియా, టాటా స్టీల్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్, టెక్ మహీంద్రా, డాక్టర్ రెడ్డీస్, హెచ్‌యూఎల్ షేర్లూ మదుపరులను ఆకట్టుకోలేకపోయాయి.
నష్టాలకు కారణాలివే..
ఎఫ్ఐఐల అమ్మకాలు
అంతర్జాతీయంగా ప్రధాన మార్కెట్లలో బలహీనత
ఆకర్షణీయంగా బాండ్ ఈల్డులు
డాలర్‌తో పోల్చితే రూపాయి క్షీణత
ప్రపంచానికి ఆర్థిక మాంద్యం ముప్పు
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తీవ్రతరం
ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న రిజర్వ్ బ్యాంకుల వడ్డీరేట్లు