ముంబై, సెప్టెంబర్ 16: దేశీయ స్టాక్ మార్కెట్లు కదంతొక్కాయి. భారత్-అమెరికా దేశాల మధ్య వాణిజ్య చర్చలు జరుగుతుండటంతోపాటు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలు మదుపరుల్లో ఉత్సాహాన్ని నింపింది. ఫలితంగా కొనుగోళ్లకు మొగ్గుచూపడంతో సెన్సెక్స్ మళ్లీ 82 వేల మైలురాయిని అధిగమించింది. ఇంట్రాడేలో 600 పాయింట్లకు పైగా ఎగబాకిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ మార్కెట్ ముగిసే సమయానికి 594.95 పాయింట్లు లాభపడి 82,380.69 పాయింట్ల వద్ద లాభపడింది. మరో సూచీ నిఫ్టీ 169.90 పాయింట్లు అందుకొని 25,239.10 వద్ద స్థిరపడింది.
వాణిజ్యంపై అమెరికా-భారత్ దేశాల మధ్య ప్రారంభమైన చర్చలు ఈసారి కొలిక్కి వచ్చే అవకాశాలుండటం మదుపరులను కొనుగోళ్ల వైపు నడిపించాయి. దీనికి తోడు అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీరేట్లను పావు శాతం తగ్గించే అవకాశాలుండటం కూడా కొనుగోళ్లకు ఉత్సాహాన్ని నింపిందని జియోజిట్ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. వచ్చేవారం నుంచి జీఎస్టీ నూతన రేట్లు అమలులోకి రానుండటంతో వాహన, కన్జ్యూమర్ డ్యూరబుల్ రంగ షేర్లు భారీగా పుంజుకున్నాయన్నారు.