ముంబై, డిసెంబర్ 11: దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం లాభాల్లో ముగిశాయి. వరుసగా 3 రోజులపాటు నష్టాలకే పరిమితమైన సూచీలు.. తిరిగి వృద్ధిబాట పట్టాయి. ఈ క్రమంలోనే బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 426.86 పాయింట్లు లేదా 0.51 శాతం పుంజుకొని 84,818.13 వద్ద ముగిసింది. ట్రేడింగ్‌లో తీవ్ర ఒడిదుడుకులకు లోనైన సూచీ.. ఒకానొక దశలో 84,150.19 పాయింట్లకు పడిపోగా, మరొక స్థాయిలో 84,906.93 పాయింట్లకు పెరిగింది. ఇక నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ కూడా 140.55 పాయింట్లు లేదా 0.55 శాతం ఎగిసి 25,898.55 వద్ద స్థిరపడింది. ఇంట్రా-డేలోనైతే 25,922.80 స్థాయికి ఎగబాకింది. కాగా, అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ కీలక వడ్డీరేటును పావు శాతం (25 బేసిస్ పాయింట్లు) కోత పెట్టడం మార్కెట్ సెంటిమెంట్‌ను బలపరిచిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో భాగంగానే మెటల్, ఆటో రంగ షేర్లకు మదుపరుల నుంచి డిమాండ్ కనిపించిందని చెప్తున్నారు.
మెటల్ షేర్లు అత్యధికంగా 1.14 శాతం లాభపడ్డాయి. ఆ తర్వాత ఆటో రంగ షేర్లు 1.08 శాతం కోలుకున్నాయి. కమోడిటీస్, ఐటీ, టెలికం, హెల్త్‌కేర్, రియల్టీ షేర్లకూ గిరాకీ కనిపించింది. ఎటర్నల్, టాటా స్టీల్, కొటక్ మహీంద్రా బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, మారుతీ సుజుకీ, సన్ ఫార్మా, టెక్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టాటా మోటర్స్ ప్యాసింజర్ వెహికిల్స్, ఇన్ఫోసిస్, ట్రెంట్, మహీంద్రా అండ్ మహీంద్రా, రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ కంపెనీల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. అయితే చమురు-గ్యాస్ రంగ షేర్లు మాత్రం నష్టపోయాయి. ఇక బీఎస్ఈ మిడ్‌క్యాప్ సూచీ 0.79 శాతం, స్మాల్‌క్యాప్ సూచీ 0.51 శాతం చొప్పున పెరిగాయి.
అంతర్జాతీయ మార్కెట్ల విషయానికొస్తే.. ఆసియా దేశాల్లో ప్రధానమైన జపాన్, చైనా, దక్షిణ కొరియా, హాంకాంగ్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. ఐరోపాలోని కీలక దేశాల మార్కెట్లు మాత్రం లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. కాగా, భారతీయ స్టాక్ మార్కెట్లలో దేశీయ సంస్థాగత మదుపరుల (డీఐఐ) పెట్టుబడులు కొనసాగుతున్నాయి. అలాగే మరోవైపు ఎఫ్ఐఐ పెట్టుబడులు తరలిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఎఫ్ఐఐల నుంచి కొనుగోళ్ల మద్దతు అందితే ఈక్విటీ మార్కెట్లు ఇంకా పెరిగే వీలుందని మార్కెట్ విశ్లేషకులు చెప్తున్నారు.