ముంబై, జూన్ 6: పడిలేచిన కెరటంలా దూసుకుపోతున్నాయి దేశీయ స్టాక్ మార్కెట్లు. వరుసగా రెండోరోజు గురువారం కూడా సూచీలు భారీగా లాభపడ్డాయి. ఎన్డీఏ కూటమి సులువుగా అధికారం చేపట్టే అవకాశాలుండటంతో మదుపరులు ఎగబడి కొనుగోళ్లు జరిపారు. ఫలితంగా 30 షేర్ల ఇండెక్స్ సూచీ తిరిగి 75 వేల మార్క్‌ను అధిగమించింది. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 692.27 పాయింట్లు ఎగబాకి 75,074.51 వద్ద ముగిశాయి. ఇంట్రాడేలో 915 పాయింట్ల వరకు లాభపడిన సూచీ చివర్లో ఈ లాభాలను నిలుపుకోలేకపోయింది. మరో సూచీ నిఫ్టీ 201.05 పాయింట్లు అందుకొని 22,821.40 వద్ద నిలిచింది. నిలకడైన ప్రభుత్వం అధికారంలోకి రాబోతుండటంతో మార్కెట్లలో పాజిటివ్ దోరణి కనిపించిందని జియోజిట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు.
స్టాక్ మార్కెట్లు వరుస లాభాల్లో దూసుకుపోతుండటంతో లక్షల కోట్ల మదుపరుల సంపద పెరిగింది. వరుసగా రెండు రోజుల్లో రూ.21 లక్షల కోట్ల మేర పెరిగింది. దీంతో బీఎస్ఈలో లిైస్టెన కంపెనీల మార్కెట్ విలువ రూ.21,05,298.11 కోట్లు పెరిగి రూ.4,15,89,003.38 కోట్లకు (4.98 ట్రిలియన్ డాలర్లు) చేరుకున్నది.