India-US trade deal : అగ్రరాజ్యం అమెరికా (USA) తో ట్రేడ్ డీల్ (Trade deal) తర్వాత ఆసియాలో భారత్ మెరుగైన స్థితికి చేరుకుందని ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ సంస్థ అయిన జేఎం ఫైనాన్షియల్ (JM Financial) నివేదిక వెల్లడించింది. ఈ ఒప్పందం భారత మార్కెట్లకు సానుకూలాంశమని నివేదిక పేర్కొన్నది. భారత కరెన్సీ బలపడటానికి ఇది దోహదం చేస్తుందని తెలిపింది.
భారత్- అమెరికా దేశాల మధ్య ఇటీవల మధ్యంతర వాణిజ్య ఒప్పందం ఖరారైంది. ఈ డీల్ నేపథ్యంలో రష్యా నుంచి చమురు దిగుమతులు తగ్గించుకోనందుకు ప్రతీకారంగా వేసిన 25 శాతం అదనపు సుంకాలను అమెరికా ఎత్తివేసింది. ఫలితంగా భారత ఉత్పత్తులపై ఉన్న 50 శాతం సుంకాలు 18 శాతానికి తగ్గాయి. పాకిస్థాన్, చైనా, శ్రీలంక, బంగ్లాదేశ్ లాంటి పలు ఆసియా దేశాలపై అగ్రరాజ్యం అమలుచేస్తోన్న సుంకాలతో పోలిస్తే ఇది చాలా తక్కువ కావడం గమనార్హం.