ఫిబ్రవరి ప్రారంభంలో భారీ ఊగిసలాటల తర్వాత క్రిప్టో మార్కెట్ ఇప్పుడు కొంత స్థిరంగా ఉంది. బిట్‌కాయిన్ ధర ప్రస్తుతం సుమారు $70,000 చుట్టూ తిరుగుతోంది. గత వారం $65,000 కంటే దిగువకు వచ్చిన ధర మళ్లీ $68,000–$72,000 రేంజ్‌లోకి వచ్చింది. ఈ దశలో మార్కెట్ స్పష్టంగా పైకి లేదా కిందకి వెళ్లకుండా కొంతకాలం ఇదే పరిధిలో ఉండే అవకాశం ఉంది.
సాధారణంగా చెప్పాలంటే, $70,000 ఒక కీలక స్థాయి. ధర $68,000 కంటే దిగువకు పడితే, తదుపరి బలమైన మద్దతు $60,000–$62,000 వద్ద ఉంది. పైవైపు చూస్తే, $74,000–$75,000 దగ్గర అమ్మకాల ఒత్తిడి ఉంది. $80,000 పైకి వెళ్లాలంటే మార్కెట్లో బలమైన కొత్త కొనుగోళ్లు అవసరం.
ప్రస్తుతం చాలా మంది ఇన్వెస్టర్లు తమ పెట్టుబడుల్లో నష్టాల్లో ఉన్నారు. అందుకే ధర కొంచెం పెరిగినప్పుడల్లా, కొత్తగా కొనడం కంటే అమ్మి బయటపడే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే కారణంగా ధర వేగంగా పైకి వెళ్లడం కష్టంగా మారింది. ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు కూడా ఇప్పటివరకు పూర్తిగా నమ్మకంతో మార్కెట్లోకి రావడం లేదు. ఇటీవల ETFల ద్వారా కొంత డబ్బు మార్కెట్లోకి వచ్చినా, అది దీర్ఘకాల పెట్టుబడులకంటే తాత్కాలికంగా పెట్టుబడి పెట్టినట్లే కనిపిస్తోంది.
ఇప్పుడంతా అమెరికా ఆర్థిక డేటాపై ఆధారపడి ఉంది. ఫిబ్రవరి 10–11 తేదీల్లో వచ్చే ద్రవ్యోల్బణం (CPI) మరియు రిటైల్ సేల్స్ డేటా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై ప్రభావం చూపుతుంది. వడ్డీ రేట్లు ఎక్కువ కాలం అలాగే ఉంటే, క్రిప్టో వంటి రిస్క్ పెట్టుబడులకు కొంత ఒత్తిడి కొనసాగుతుంది.
ఆల్ట్కాయిన్లు కూడా బిట్‌కాయిన్‌ను అనుసరిస్తున్నాయి. ఎథీరియం $2,000 పైగా నిలబడుతోంది. మొత్తం మీద, మార్కెట్ ఇంకా పూర్తిగా కోలుకోలేదు కానీ కూలిపోతున్న పరిస్థితి కూడా లేదు.
“ఇప్పుడు మార్కెట్ రికవరీ దశలో కాకుండా, స్థిరపడే దశలో ఉంది. ఒక్కసారిగా భారీగా పెట్టుబడి పెట్టడం కన్నా, ధర పడినప్పుడు నెమ్మదిగా, క్రమంగా కొనుగోలు చేయడం మంచిది. $60,000–$62,000 ప్రాంతం మంచి లాంగ్‌టర్మ్ కొనుగోలు జోన్‌గా ఉండొచ్చు. లీవరేజ్ ట్రేడింగ్‌కు దూరంగా ఉండాలి. బిట్‌కాయిన్‌లో పెట్టుబడి పెట్టాలనుకునే వారు క్రిప్టో SIPలు వంటి మార్గాల ద్వారా క్రమంగా ఇన్వెస్ట్ చేస్తే, వోలాటిలిటీ ప్రభావం తగ్గుతుంది.” అని సుబ్బు రాజ్ తెలిపారు.