Stock News | దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 207 పాయింట్ల పతనంతో 61,456 వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. నిఫ్టీ 61 పాయింట్లు తగ్గి 18,246 పాయింట్ల వద్ద ట్రేడింగ్ మొదలైంది. బ్యాంక్ నిఫ్టీలో 150 పాయింట్ల పతనంతో 42,286 పాయింట్ల స్థాయిలో ట్రేడింగ్ ప్రారంభమైంది. టేడ్రింగ్ మొదలై నుంచే మార్కెట్లలో ఒత్తిడి కనిపిస్తున్నది. దీనికి తోడు ఆసియా మార్కెట్లు సైతం నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. ఎస్‌జీఎక్స్ నిఫ్టీ 95 పాయింట్లు పడిపోయి, ప్రస్తుతం 18250 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. డౌ ఫ్యూచర్స్ సైతం ఒత్తిడిలోనే ఉన్నాయి. దాదాపు 100 పాయింట్ల మేర పతనమైంది. ప్రస్తుతం సెన్సెక్స్ 486 పాయింట్లు తగ్గి 61,179 పాయింట్లు, నిఫ్టీ 145 పడిపోయి 18,161 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నది. ముడిచమురు ధర బలహీనంగా ఉన్నది.
ప్రస్తుతం ప్రపంచ మార్కెట్లో ముడి చమురు ధర బ్యారెల్‌కు 87 డాలర్లుగా ఉంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి 0.20 అంటే దాదాపు 0.24 శాతం క్షీణించి రూ.81.84 వద్ద ట్రేడవుతోంది. సోమవారం మార్కెట్ ప్రారంభ ట్రేడింగ్‌లో టాటా స్టీల్, భారతీ ఎయిర్టెల్, అల్ట్రాటెక్ సిమెంట్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, డాక్టర్ రెడ్డిస్, టెక్ మహీంద్రా ఐ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. అన్ని మార్కెట్ సూచీలు దాదాపు నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. ఐటీ రంగ షేర్లు అత్యధికంగా 1.03 శాతం క్షీణించగా, రియల్ ఎస్టేట్ రంగం 0.98 శాతం పడిపోయింది. కన్స్యూమర్ డ్యూరబుల్స్ ఇండెక్స్ 0.45 శాతం, మెటల్ రంగ షేర్లు 0.73 శాతం క్షీణించాయి.