Sri Chidambaram Review | టాలీవుడ్ నుంచి మరో వినూత్నమైన, సందేశాత్మక చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యువ నటులు వంశీ తుమ్మల, సంధ్య వశిష్ట ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘శ్రీ చిదంబరం గారు’. వినయ్ రత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని చింతా వినీషా రెడ్డి, చింతా గోపాలకృష్ణ రెడ్డి నిర్మించారు. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి ఒక పాట పాడటం ఈ సినిమాపై ప్రత్యేక ఆసక్తిని కలిగించింది. మరి నేడు థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం.
కథ
రాజమండ్రిలోని ఒక పల్లెటూరిలో నివసించే సోలమన్ (వంశీ తుమ్మల)కు మెల్లకన్ను ఉంటుంది. దీంతో ఊరిలో ఉన్నవారందరూ అతడిని ‘చిదంబరం’ అని ఎగతాళి చేస్తుంటారు. ఈ అవమానాన్ని తట్టుకోలేక సోలమాన్ తన చిన్నప్పుడే చదువు మానేస్తాడు. తన లోపాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఎప్పుడూ కళ్లజోడు ధరిస్తుంటాడు. తండ్రి చేసిన అప్పుల వలన మేస్త్రీ పనులకు వెళ్తుంటాడు. అయితే అదే గ్రామానికి చెందిన లీలా (సంధ్య వశిష్ట)కు సోలమన్ అంటే ప్రాణం. కానీ, తన లోపం వల్ల ఆమె తనను ఇష్టపడదని భ్రమపడి సోలమన్ ఆమెకు దూరంగా ఉంటాడు. అయితే ఒక చిన్న అపార్థం వారి మధ్య దూరాన్ని ఎలా పెంచింది? చివరకు తన ఆత్మన్యూనతా భావాన్ని వదిలి సోలమన్ ప్రపంచాన్ని ధైర్యంగా ఎలా ఎదుర్కొన్నాడు? అనేదే సినిమా కథ.
విశ్లేషణ:
దర్శకుడు వినయ్ రత్నం ఎంచుకున్న పాయింట్ చాలా సరళమైనది అయినప్పటికీ, దానికి బలమైన భావోద్వేగాలను జోడించడంలో ఆయన సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు. ముఖ్యంగా శారీరక లోపాలు ఉన్నవారు సమాజంలో ఎదుర్కొనే అవమానాలను, వారిలో కలిగే మానసిక సంఘర్షణను ఈ సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపించాడు దర్శకుడు. గోదావరి తీర ప్రాంతపు పల్లెటూరి వాతావరణాన్ని, అక్కడి ప్రజల జీవనశైలిని ఎంతో సహజంగా చిత్రీకరించడం సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. ప్రథమార్థంలో లీలా-సోలమన్ల మధ్య సాగే సున్నితమైన ప్రేమ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. కథలో భాగంగా మతం పేరుతో జరిగే మోసాలను అంతర్లీనంగా విమర్శిస్తూ చూపించిన తీరు బాగుంది. అయితే, ద్వితీయార్థంలో కొన్ని సన్నివేశాలు సాగదీతగా అనిపించి నెమ్మదించడం సినిమా వేగాన్ని తగ్గించింది. హీరో మనస్తత్వంలో వచ్చే మార్పుకు సంబంధించి ఇంకాస్త బలమైన కారణాలు చూపిస్తే కథలో తీవ్రత మరింత పెరిగేది. ఎడిటింగ్ విషయంలో మరికొంత జాగ్రత్త వహించి ఉంటే సినిమా ఇంకా క్రిస్పీగా ఉండేది. అయినప్పటికీ, క్లైమాక్స్‌లో దర్శకుడు ఇచ్చిన సందేశం ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేసేలా ఉండి, సినిమాపై సానుకూల ప్రభావం చూపుతుంది.
నటీనటులు
తొలి చిత్రమే అయినా వంశీ తుమ్మల మెల్లకన్ను ఉన్న యువకుడిగా అద్భుతమైన నటన కనబరిచారు. భావోద్వేగ సీన్లలో ఆయన పరిణతి కనిపిస్తుంది. ఇక లీలా పాత్రలో సంధ్య వశిష్ట పల్లెటూరి అమ్మాయిగా చక్కగా ఒదిగిపోయారు. హీరో తల్లిగా కల్పలత, హీరోయిన్ తల్లిగా తులసి తమ అనుభవజ్ఞతతో పాత్రలకు ప్రాణం పోశారు.
సాంకేతిక విభాగం:
ఈ సినిమాకు ప్రధాన బలం చందు-రవి సంగీతం. పాటలు మెలోడీగా ఉండి వినడానికి చాలా బాగున్నాయి. ముఖ్యంగా ఎం.ఎం. కీరవాణి గారు పాడిన ‘వెళ్లే దారిలోన’ పాట సినిమాకు హైలైట్‌గా నిలుస్తుంది. అక్షయ్ రామ్ పోడిశెట్టి సినిమాటోగ్రఫీ పల్లెటూరి అందాలను, సహజత్వాన్ని అద్భుతంగా బంధించింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా రిచ్‌గా ఉన్నాయి.
చివరగా.. శారీరక లోపం కంటే.. మనలోని ఆత్మన్యూనతా భావమే పెద్ద శాపం అని చాటిచెప్పే సినిమా ‘శ్రీ చిదంబరం గారు’. చిన్న చిన్న లోపాలు ఉన్నప్పటికీ, మంచి భావోద్వేగాలతో కూడిన సినిమా చూడాలనుకునే వారికి ఇది ఒక మంచి ఛాయిస్.
రేటింగ్ : 2.75/5