జిన్నారం : మాజీ మంత్రి, బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్‌రావు పటాన్చెరువు నియోజకవర్గంలోని జిన్నారం మున్సిపాలిటీలో శుక్రవారం పర్యటించారు. జిన్నారం గ్రామం వాకిటి వద్ద స్థానికులతో ముచ్చటించిన ఆయన.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తున్న తీరును ఎండగట్టారు. తాము అధికారంలో ఉన్నప్పుడు జిన్నారం గ్రామం గ్రామపంచాయతీగానే ఉండాలని కోరుకున్నామని, మున్సిపాలిటీ అయితే ప్రజల మీద పన్నుల భారం పడుతుందని ఆపామని చెప్పారు.
కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే జిన్నారంను మున్సిపాలిటీ చేసి మీ మీద పన్నుల భారం మోపిందని, ఇప్పుడు ఎవరికి ఓటేద్దాం..? అని ఓటర్లను ప్రశ్నించారు. మనల్ని మంచిగా చూసుకున్న వాళ్ళకు, మన భారాన్ని తగ్గించే వాళ్ళకే ఓటేద్దామని అన్నారు. కేసీఆర్ రూ.200 ఉన్న పెన్షన్‌ను రూ.2000 చేస్తానని హామీ ఇచ్చారని, అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే ఆ హామీని నెరవేర్చారని చెప్పారు. రేవంత్ రెడ్డి రూ.4000 ఇస్తానని చెప్పి రెండేళ్లు గడిచినా ఇవ్వడం లేదని విమర్శించారు. ఏపీలో చంద్రబాబు రూ.4000 ఇస్తానని చెప్పి ఇస్తున్నాడు కదా? మరి ఇక్కడ రేవంత్ రెడ్డికి ఎందుకు చేతులు రావడం లేదు..? అని ప్రశ్నించారు.
మహాలక్ష్మి పథకం కింద నెలకు రూ.2500 ఇస్తానని చెప్పి రేవంత్ రెడ్డి మోసం చేశాడని హరీష్‌రావు విమర్శించారు. ఈ 24 నెలల్లో ఒక్కో మహిళకు ప్రభుత్వం రూ.60,000 చొప్పున బాకీ పడిందని అన్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు బతుకమ్మకు ప్రతి మహిళకు చీర ఇచ్చేదని, రేవంత్ రెడ్డి వచ్చాక చీర లేదు, గాజులు లేవని చెప్పారు. ఏదో గ్రూపులో ఉన్న కొద్దిమందికి ఇచ్చి చేతులు దులుపుకున్నాడని అన్నారు. ఫ్రీ బస్సు అని చెప్పి మగవాళ్లకు టికెట్ రేట్ డబుల్ చేశాడని తెలిపారు. ఆడోళ్ళకు సీటు దొరక్క తిప్పలు పడుతున్నారని చెప్పారు. రేవంత్ రెడ్డి వచ్చాక 5 పంటలు వస్తే.. రెండింటికి ఇచ్చి మూడింటికి రైతుబంధు ఎగ్గొట్టాడని విమర్శించారు.
నాటేసిన వాళ్లకే రైతుబంధు ఇస్తా, శాటిలైట్‌లో చూసి ఇస్తా అని కొత్త నిబంధనలు పెట్టి రైతులను గోస పెడుతున్నాడని రేవంత్‌రెడ్డిపై హరీష్‌రావు మండిపడ్డారు. దేవుడి మీద ఒట్టు వేసి రుణమాఫీ చేస్తానని చెప్పి మాట తప్పిన పాపాత్ముడు రేవంత్ రెడ్డి అని విమర్శించారు. ఏ ఊర్లో చూసినా సగం మందికి కూడా రుణమాఫీ కాలేదన్నారు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో మీరు కారు గుర్తుకు ఓటు గుద్దితే.. రేవంత్ రెడ్డికి గూబ గుయ్యిమనాలె అని పిలుపునిచ్చారు. అప్పుడే భయపడి హామీలైనా అమలు చేస్తాడని అన్నారు. ఓటుకు 5 వేలు ఇస్తామంటారని, అవి తీసుకొని మోసపోవద్దని హెచ్చరించారు. మహిళలకు రావాల్సిన రూ.60,000, అవ్వ తాతలకు రూ.4000 పెన్షన్ రావాలంటే బీఆర్ఎస్ గెలవాలని అన్నారు.
అవ్వతాతలు పెన్షన్ అడిగితే లాగుల తొండలు ఇడిసిపెడతా అంటాడని, మహిళలు హామీల గురించి అడిగితే మెడలో పేగులు వేసుకుంటా అంటాడని, తులం బంగారం ఏదని అడిగితే గుడ్లు పీకి గోటీలు ఆడుతా అంటాడని హరీష్‌రావు సీఎంను విమర్శించారు. ప్రశ్నిస్తే కళ్లు నెత్తికెక్కి మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. ఈ ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెప్పి సీఎం అహంకారాన్ని దించాలని పిలుపునిచ్చారు. రెండేళ్లు ఓపిక పట్టాలని, వచ్చేది మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వమేనని అన్నారు. జిన్నారం సమస్యలు పరిష్కరించుకుందామని చెప్పారు. రేవంత్ రెడ్డి ముస్లింలకు ఒక్క రూపాయి పని కూడా చేయలేదని, కాబట్టి అందరూ ఏకమై కారు గుర్తు అభ్యర్థులను గెలిపించాలని కోరారు.