Stock Markets | ముంబై, సెప్టెంబర్ 30: దేశీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. అంతర్జాతీయ దేశాల్లో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులకు తోడు జపాన్ సూచీలు కుప్పకూలడం దేశీయ మార్కెట్ల పతనానికి ఆజ్యంపోశాయి. బ్యాంకింగ్, ఆర్థిక, వాహన రంగ షేర్లలో క్రయవిక్రయాలు జోరుగా సాగాయి. ఇంట్రాడేలో 1,300 పాయింట్లకు పైగా నష్టపోయిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు 1,272.07 పాయింట్లు (1.49 శాతం) నష్టపోయి 85 వేల దిగువకు 84,299.78 వద్ద నిలిచింది. మరో సూచీ నిఫ్టీ కూడా 368.10 పాయింట్లు లేదా 1.41 శాతం పతనం చెంది 25,810.85 వద్ద ముగిసింది. స్టాక్ మార్కెట్ల భారీ నష్టంతో లక్షల కోట్ల మదుపరుల సంపద హారతి కర్పూరంలా కరిగిపోయింది. బీఎస్ఈ లిైస్టెన కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ రూ.3,57,885.53 కోట్లు కరిగిపోయి రూ.4,74,35,137.15 కోట్లకు (5.66 ట్రిలియన్ డాలర్ల) పడిపోయింది. గడిచిన రెండు నెలలుగా పెరుగుతూ వచ్చిన నిఫ్టీ భారీగా నష్టపోయిందని, చైనా ఇటీవల తీసుకున్న ఉద్దీపన ప్యాకేజీతో విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను అక్కడికి తరలించడం కూడా ఇతర దేశాల సూచీలపై ప్రతికూల ప్రభావం చూపాయని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీ హెడ్ దీపక్ జసాని తెలిపారు.
దేశీయ కుబేరుడిలో ఒకరైన ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు కుప్పకూలింది. కంపెనీ షేరు విలువ 3.23 శాతం నష్టపోయి రూ.2,953.80 వద్ద నిలిచింది. అటు ఎన్ఎస్ఈలోనూ షేరు 3.13 శాతం నష్టంతో రూ.2,956.70 వద్ద ముగిసింది. దీంతో కంపెనీ మార్కెట్ విలువ రూ.66,818.76 కోట్లు కోల్పోయి రూ.20 లక్షల కోట్ల దిగువకు పడిపోయింది. చివరకు రూ.19,98,503.98 కోట్లకు పడిపోయింది.
ఈ ఏడాది చివరినాటికి సెన్సెక్స్ లక్ష పాయింట్లకు చేరుకునే అవకాశాలున్నాయని మార్కెట్ పండితులు అంచనావేస్తున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం అవుతుండటం ఇందుకు కారణమన్నారు. గడిచిన మూడు నెలల్లో సూచీ 18 శాతం రిటర్నులు పంచడంతో ఈ ఏడాది చివరినాటికి 1,00,000 పాయింట్లకు చేరుకోవడం పెద్ద కష్టమేమి కాదని వెటరన్ ఎమర్జింగ్ మార్కెట్ ఇన్వెస్టర్ మార్క్ మోబియన్ తన అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. 2015 తర్వాత ఒకే ఏడాది ఇంతటి స్థాయిలో రిటర్నులు పంచడం ఇదే తొలిసారన్నారు.