Domestic Air Traffic | గతంతో పోలిస్తే దేశీయంగా విమాన ప్రయాణాలు చేసే వారి సంఖ్య పెరుగుతోంది. గత నెలలో 1.29 కోట్ల మందికి పైగా ప్రయాణికులు దేశంలోని వివిధ ప్రాంతాలకు ప్రయాణించారు. గతేడాదితో పోలిస్తే 7.3 శాతానికి పైగా వృద్ధి పెరిగింది. అయితే జూన్ నెలలో 1.32 కోట్ల మంది విమాన ప్రయాణంతో పోలిస్తే జూలైలో తక్కువే. 2023 జూలైలో 121 లక్షల మంది ప్రయాణిస్తే ఈ ఏడాది జూలైలో 129.87 లక్షల మంది ప్రయాణం చేశారు. 2024 జూన్ నెలలో 132.06 లక్షల మంది ప్రయాణించారు.
ఎప్పటి మాదిరిగానే దేశీయ విమానయానంలో ఇండిగో ఆధిపత్యం కొనసాగుతూనే ఉంది. గత నెల విమాన ప్రయాణాల్లో ఇండిగో 62 శాతం మార్కెట్ వాటా పెంచుకున్నది. మరోవైపు టాటా సన్స్ ఎయిర్ ఇండియా 14.3 శాతానికి పడిపోయింది. విస్తారా వాటా 10 శాతం పెరిగితే, ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ వాటా 4.5, స్పైస్ జెట్ 3.1 శాతం వాటా తగ్గిందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) తెలిపింది. ఆకాశా ఎయిర్ వాటా 4.7, అలయెన్స్ ఎయిర్ వాటా 0.9 శాతం తగ్గాయి. ‘2024 జనవరి-జూలై మధ్య 923.35 లక్షల మంది విమాన ప్రయాణం చేశారు. 2023లో 881.94 లక్షల మంది ప్రయాణం చేశారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది వార్షిక వృద్ధి 4.70 శాతం, నెలవారీ వృద్ధిరేటు 7.33 శాతం వృద్ధిరేటు సాధిచాం’ అని డీజీసీఏ వెల్లడించింది.