న్యూఢిల్లీ, ఏప్రిల్ 26: పాకిస్థాన్ గగనతలాన్ని మూసేయడంతో మన దేశం నుంచి రాకపోకలు సాగించే అంతర్జాతీయ విమానాల్లో పాటించవలసిన ప్రమాణాలను పౌర విమానయాన నియంత్రణ మండలి డీజీసీఏ (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) శనివారం విడుదల చేసింది. విమానయాన సంస్థలకు జారీ చేసిన ఈ ఆదేశాల ప్రకారం.. అంతర్జాతీయ గగనతల మూసివేతలు, ఇతర ఆంక్షల కారణంగా విమానయాన సంస్థల కార్యకలాపాలపై ప్రభావం పడుతుంది. అంతర్జాతీయ, ప్రాంతీయ విమానాలను షెడ్యూలు మార్గంలో కాకుండా వేరొక మార్గంలో నడపవలసిన అవసరం ఏర్పడుతుంది.
ప్రయాణ సమయం అధికంకానున్నది. నిర్వహణ, ఇంధన అవసరాల కోసం మార్గమధ్యంలో ఆగవలసిన అవసరం రావచ్చు. విమానం బయల్దేరే సమయం, గమ్యస్థానానికి చేరుకునే సమయం, షెడ్యూలు ప్రకారం ప్రయాణ సమయం, వేరొక మార్గంలో నడపటం వల్ల పెరిగే ప్రయాణ సమయం వంటివాటి గురించి ప్రయాణికులకు ముందుగానే తెలియజేయాలి.
చెక్-ఇన్, బోర్డింగ్ గేట్ల వద్ద ఈ సమాచారాన్ని ఉంచాలి. అవకాశం ఉంటే ఎస్ఎంఎస్/ఈ-మెయిల్ ద్వారా చెప్పాలి. భోజనం, పానీయాలు వంటివాటిని మొత్తం ప్రయాణ సమయంలో ప్రయాణికులకు అందుబాటులో ఉంచాలి. వైద్య సాయానికి తగిన ఏర్పాట్లు కూడా చేయాలని సూచించింది. అలాగే ప్రత్యామ్నాయ విమానాశ్రయాలను సిద్ధంగా ఉంచుకోవాలి. కస్టమర్ సపోర్ట్, సర్వీస్‌కు సిద్ధంగా ఉండాలి. శాఖల్లో అంతర్గత సమన్వయం ఏర్పరచుకోవాలి. పహెల్గాం ఉగ్రవాద దాడి అనంతరం ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పాకిస్థాన్ గగనతలాన్ని భారతీయ విమానాలకు మూసివేయడం వల్ల ఢిల్లీ సహా ఉత్తరాది నుంచి రాకపోకలు సాగించే విమానాల ప్రయాణ సమయం పెరుగుతున్న సంగతి తెలిసిందే.
విమాన ప్రయాణికులు మరింత పెరిగారు. మార్చి నెలలో దేశీయ విమానయాన సంస్థలు 1.45 కోట్ల మందిని తమ గమ్యస్థానాలకు చేర్చాయి. అంతక్రితం ఏడాది ఇదే నెలలో ప్రయాణించిన 1.33 కోట్ల మందితో పోలిస్తే 8.79 శాతం అధికమయ్యారని నెలవారి సమీక్షలో భాగంగా డీజీసీఏ వెల్లడించింది. వీరిలో దేశీయ విమాన దిగ్గజం ఇండిగోనే 93.1 లక్షల మంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేర్చింది.
ఆ తర్వాతి స్థానంలో ఎయిర్ ఇండియా గ్రూపు విమానాల్లో 38.8 లక్షల మంది ప్రయాణించారు. కంపెనీ మార్కెట్ వాటా 26.7 శాతంగా ఉన్నది. వీటితోపాటు ఆకాశ ఎయిర్ విమానాల్లో 7.2 లక్షల మంది ప్రయాణించగా, స్పైస్‌జెట్‌లో 4.8 లక్షల మంది ప్రయాణించారని తెలిపింది. సరైన సమయానికి వచ్చిన విమాన సర్వీసుల జాబితాలో ఇండిగో 88.1 శాతం వాటాతో తొలిస్థానంలో నిలువగా..ఆకాశ ఎయిర్ 86.9 శాతం, ఎయిర్ ఇండియా 82 శాతం, స్పైస్‌జెట్ 72.1 శాతంతో ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.