Akshaya Tritiya | భారతీయులకు బంగారం ఎంటే ఎంతో మక్కువ. వివాహాలు, ఇతర శుభాకార్యాల సమయంలో పెద్ద ఎత్తున బంగారం కొనుగోలు చేస్తుంటారు. ముఖ్యంగా అక్షయ తృతీయ రోజున పెద్ద ఎత్తున పసిడిని కొనుగోలు చేస్తుంటారు. అక్షయ తృతీయ రోజున బంగారం కొనుగోలు సెంటిమెంట్‌గా మారింది. ప్రస్తుతం, బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరాయి. గత కొద్దిరోజులుగా ధరలు గణనీయంగా తగ్గుతూ వచ్చాయి. వ్యాపారులు లాభాల స్వీకరణకు దిగడం, డాలర్‌కు డిమాండ్ పెరిగిన నేపథ్యంలో బంగారం ధరల్లో హెచ్చుతగ్గులున్నాయి. అయినప్పటికీ అక్షయ తృతీయ రోజున భారతీయులు పెద్ద సంఖ్యలో బంగారం కొంటారని బులియన్ మార్కెట్ వ్యాపారులు అంచనా వేస్తున్నారు. కొనుగోలుదారులు అవసరానికి అనుగుణంగా ఆభరణాలు కొనుగోలు చేస్తున్నారని.. తేలికపాటి ఆభరణాల నుంచి గోల్డ్ ఈటీఎఫ్స్, డిజిటల్ గోల్డ్, బార్లతో సహా కాయిన్స్ వరకు వివిధ రకాలుగా బంగారాన్ని కొనుగోలు చేసేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. ఈ నెల 30న అక్షయ తృతీయ రోజున ధరలను పరిశీలిచి బంగారం కొనాలా? వద్దా? అనే నిర్ణయం తీసుకోవచ్చని ఆభరణాల వ్యాపారులు పేర్కొంటున్నారు.
పీఎన్జీ జ్యువెల్లర్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సౌరభ్ గాడ్గిల్ మాట్లాడుతూ.. బంగారం ధరలు రికార్డు స్థాయిలో ఉన్నప్పటికీ.. వినియోగదారుల సెంటిమెంట్ బలంగానే ఉందని పేర్కొన్నారు. అక్షయ తృతీయ రోజున బంగారం అమ్మకాలు పెరుగుతాయని తాము ఆశిస్తున్నామని తెలిపారు. అయితే, అధిక ధరలు గత సంవత్సరంతో పోలిస్తే వాల్యూమ్ వృద్ధిని తగ్గించవచ్చని.. విలువ పెరుగుదల కారణంగా ఇది భర్తీ చేయబడుతుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం అమ్మకాలపై ఎలాంటి ఒత్తిడిని కనిపించడం లేదని, దాంతో పాటు ముఖ్యంగా ప్రపంచ అనిశ్చితి దృష్ట్యా బంగారాన్ని సురక్షితమైన, నమ్మదగిన పెట్టుబడిగా చూస్తున్నారన్నారు. ఈ పండగ సీజన్లో బలమైన అమ్మకాలు జరుగుతాయని ఆశిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం నాణేలు, బార్ బుకింగ్ చాలాకాలం కిందట జరిగిందని ఇండియన్ బులియన్ అండ్ జ్యువెలరీ అసోసియేషన్ జాతీయ ప్రతినిధి కుమార్ జైన్ చెప్పారు. కానీ, గత సంవత్సరం కంటే చాలా తక్కువ. అయినప్పటికీ, అక్షయ తృతీయ నాడు అమ్మకాలు ఉండవచ్చని ఆశిస్తున్నారు. జవేరి బజార్‌లోని బీడీ బ్యాంగిల్స్ శ్రేయాస్ కొఠారి మాట్లాడుతూ.. ఈ సందర్భంగా వినియోగదారులు షాపింగ్ చేస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. అధిక బంగారం ధరల కారణంగా తేలికైన ఆభరణాల కొనుగోలు ఉంటుందని.. పాత ఆభరణాల స్థానంలో కొత్త ఆభరణాలతో మార్పిడి ఉంటుందని అంచనా. ఆభరణాల తయారీపై డిస్కౌంట్స్ అందిస్తున్నామని.. కొనుగోలుదారుల కోసం అనేక ఆఫర్లను తీసుకువస్తున్నట్లు తెలిపారు.
వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఇండియా రీజనల్ సీఈవో సచిన్ జైన్ మాట్లాడుతూ.. ఈ ఏడాది బంగారానికి కీలకమైందని పేర్కొన్నారు. జనవరి నుంచి ప్రపంచ ధరలు 25శాతం పెరిగాయి. దేశీయ మార్కెట్లో కూడా బంగారం ధరలు పది గ్రాములకు రూ. లక్షకు చేరుకుంది. సురక్షితమైన పెట్టుబడి, మంచి రాబడి కారణంగా బంగారంలో హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ.. ఈ అక్షయ తృతీయ రోజున కొనుగోళ్లు ఉంటాయని ఆయన చెప్పారు. బంగారం ఈటీఎఫ్స్, డిజిటల్ బంగారం, నాణేలు, గోల్డ్ బార్స్లు వివిధ రకాల బంగారంపై కొనుగోలుదారులు బలమైన ఆసక్తిని చూపిస్తున్నారని వర్గాలు తెలిపాయి. బంగారం ఆభరణాల రిటైర్లు తగినంత స్టాక్స్‌ని కలిగి ఉండగా.. పండుగలతో పాటు వివాహల సీజన్లో ప్రారంభమవుతున్నందున కొనుగోళ్లు ఆశాజనకంగా ఉండొచ్చని ఆశిస్తున్నారు.
లైట్ వెయిటెడ్ ఆభరణాలను తయారు చేసే అన్ని బ్రాండ్లు అక్షయ తృతీయ రోజున అమ్మకాలను పెంచేందుకు వినియోగదారులకు వివిధ ఆఫర్లు, డిస్కౌంట్లను అందిస్తున్నాయి. ఇందులో ప్రత్యేక కొనుగోళ్లపై 0.5 గ్రాముల బంగారు నాణెం ఉచితంగా ఇస్తున్నది. వజ్రాల ఆభరణాలపై 60 శాతం వరకు తగ్గింపును ఇస్తున్నది. అదే సమయంలో బంగారు ఆభరణాల తయారీపై వినియోగదారులకు 100 శాతం వరకు తగ్గింపును ఇస్తున్నది. అక్షయ తృతీయ నాడు అమ్మకాలను పెంచేందుకు క్యారెట్లేవ్ నుంచి షాపింగ్ చేసేటప్పుడు వినియోగదారులు 0.5 గ్రాముల బంగారు నాణెం ఉచితంగా ఇస్తున్నట్లు క్యారెట్‌లేన్ సీఈవో సౌమెన్ భౌమిక్ చెప్పారు. ఇది అక్షయ తృతీయ రోజున కొనుగోలును మరింత ప్రత్యేకంగా చేస్తుందని.. ఈ సందర్భంగా అనేక ఆఫర్లు, ఫాస్ట్ డెలివరీ సౌకర్యం అందుబాటులో ఉన్నాయన్నారు. తనిష్క్ మియా బిజినెస్ హెడ్ శ్యామల రామనన్ మాట్లాడుతూ.. మియా అక్షయ తృతీయకు ఆకర్షణీయమైన ఆఫర్లను అందిస్తున్నామని.. అక్షయ తృతీయకే పరితమైన వజ్రం, వెండి బంగారు ఆభరణాలపై భారీ తగ్గింపులు ఇస్తున్నట్లు వివరించారు.
గతేడాది అంటే 2024లో అక్షయ తృతీయన మే 10న ఉండగా.. బంగారం ధరలు పది గ్రాములకు రూ.73,240గా ఉంది. అప్పటి నుంచి బంగారం ధరల్లో ఈ పెరుగుదల కొనసాగుతూ వచ్చింది. ప్రస్తుతం పది గ్రాములకు రూ. 95,420 పలుకుతున్నది. గత 11 నెల్లలో బంగారం ధరల్లో 31శాతం పెరిగింది. గత సంవత్సరం అక్షయ తృతీయ రోజున బంగారం అమ్మకాలు 20శాతానికిపైగా పెరిగాయి. ప్రస్తుత కాలంలో బంగారం ధరల మెరుగుదలను అంచనా వేయడం కష్టమని సౌరభ్ గాడ్గిల్ పేర్కొన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అనేక సవాళ్లను ఎదుర్కొంటున్న కాలంలో ఉన్నామని.. అందువల్ల బంగారంలో పెట్టుబడి పెట్టడం సురక్షితమైన ఎంపిక అని తెలిపారు. కోటక్ మహీంద్రా ఏఎంసీ ఫండ్ మేనేజర్ సతీశ్ దొండపాటి మాట్లాడుతూ.. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు కూడా గణనీయంగా తగ్గాయి. బంగారం ధరలు యూఎస్ ద్రవ్యోల్బణం, ఉపాధి డేటాతో సహా రాబోయే ఆర్థిక డేటాపై ఆధారపడి ఉంటాయని తెలిపారు. వడ్డీ రేట్లపై ఫెడరల్ రిజర్వ్ వైఖరిని నిర్ణయించడంలో కీలమైందని.. బలమైన కేంద్ర బ్యాంకు కొనుగోళ్లు, భౌగోళిక రాజకీయ అనిశ్చితుల కారణంగా బంగారానికి దీర్ఘకాలిక డిమాండ్ ఉందని చెప్పారు.