(స్పెషల్ టాస్క్ బ్యూరో)హైదరాబాద్, జనవరి 23 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వరంగ జీవిత బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ)ని విచ్ఛిన్నం చేయడానికి కేంద్రం కార్యాచరణను సిద్ధం చేస్తుందన్న వార్తలపై అటు ఎల్ఐసీ వర్గాలు, ఇటు ఆర్థిక నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డీమర్జింగ్ జరిగిన ఆర్థిక సంస్థలు ఆ తర్వాతి కాలాల్లో పతనమైన ఉదంతాలను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.
డీమర్జింగ్తో పతనమైన సంస్థలు
ఆర్థిక సంస్థ పేరు: ది ఈక్విటబుల్ లైఫ్ అష్యూరెన్స్ సొసైటీ, యూకే
ప్రారంభం: 1762
ఎందుకు డీమెర్జింగ్: నిర్మాణాత్మక మార్పుల పేరిట లాభదాయక విభాగాలను విచ్ఛిన్నం చేసి ప్రత్యేక కంపెనీలుగా మార్చారు.
ఫలితం: సంస్థ పట్ల పాలసీదారుల్లో విశ్వాసం సన్నగిల్లింది. పాలసీలు తగ్గాయి. ఇచ్చిన గ్యారెంటీలు చెల్లించలేకపోవడంతో కంపెనీ దివాలా తీసింది. పాలసీదారులకు యూకే ప్రభుత్వం పరిహారం అందజేసింది.
చివరకు: 2000లో కంపెనీ మూసివేత
ఆర్థిక సంస్థ పేరు: అమెరికన్ ఇంటర్నేషనల్ గ్రూప్, యూఎస్
ప్రారంభం: 1919
ఎందుకు డీమెర్జింగ్: సంస్కరణల పేరిట లాభదాయక విభాగాలను విచ్ఛిన్నం చేసి ప్రత్యేక కంపెనీలుగా మార్చారు.
ఫలితం: పాలసీదారులు తగ్గడంతో 180 బిలియన్ డాలర్లకు బెయిలవుట్.
చివరకు: అమెరికా ప్రభుత్వం, టాటా తదితర కంపెనీల సహకారంతో సంక్షోభం నుంచి సంస్థ బయటపడింది.
ఆర్థిక సంస్థ పేరు: జపనీస్ పోస్టల్ ఇన్సూరెన్స్ (కాంపో), జపాన్
ప్రారంభం: 1916
ఎందుకు డీమెర్జింగ్: సంస్కరణల పేరిట లాభదాయక శాఖలను కంపెనీలుగా మార్చారు.
ఫలితం: కొత్త పాలసీలు ఆగిపోయాయి. ఆదాయం తగ్గింది.
చివరకు: ప్రభుత్వం సంస్కరణలను వెనక్కి తీసుకొంది. శాఖలను మాతృ సంస్థలో విలీనం చేసింది.